Top
Telugu Gateway

ఆర్టీసీ సమ్మెపై కెసీఆర్ ను కలుస్తా..పవన్ కళ్యాణ్

ఆర్టీసీ సమ్మెపై కెసీఆర్ ను కలుస్తా..పవన్ కళ్యాణ్
X

ఆర్టీసి సమ్మెపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సమ్మె విషయంలో మొండిగా వ్యవహరించటం సరికాదన్నారు. గత 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటం బాధాకరమన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కెసీఆర్ తో చర్చించేందుకు రెండు రోజుల్లో కెసీఆర్ సమయం కోరతానని ప్రకటించారు. అప్పటికీ కెసీఆర్ స్పందించకపోతే ఆర్టీసి కార్మికుల భవిష్యత్ కార్యాచరణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యపై కెసీఆర్ సానుకూలంగా స్పందిస్తారనే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ జెఏసీ నేతలు గురువారం నాడు పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యాలయంలో కలుసుకుని తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటి వరకు 16 మంది చనిపోయారని, ఇది చాలా బాధ గా ఉందన్నారు.

ప్రతి ఒక్కరికీ తమ బాధను చెప్పుకునే హక్కు ఉంటుంది. ఇది కేవలం 48 వేల మంది సమస్య కాదు. వారి ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. రైతుల ఆత్మహత్యలు ఎలా కలచి వేశాయో ఇవి కూడా అలా కలిచి వేస్తుందని అన్నారు. చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. మేము అందరం మీ వెనుక ఉన్నాం. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు ప్రతిదానికీ పరిష్కార మార్గం ఉంటుందని పవన్ కార్మిక సంఘ నేతలకు సూచించారు. పవన్ కళ్యాణ్ ను కలసిన వారిలో జెఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డితోపాటు మరికొంత మంది నాయకులు ఉన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంపై రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కె. కేశవరావుతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీష్ రావు, కెటీఆర్ లకు కూడా వ్యక్తిగతంగా మెసేజ్ లు పెడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సమ్మె ప్రారంభించిన తొలి రోజే పవన్ కళ్యాణ్ తమకు మద్దతు తెలిపారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తమతో కలసి పోరాడిన వారంతా ఇప్పుడు మంత్రులు అయిన మొహం చాటేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తమకు మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు.

Next Story
Share it