Top
Telugu Gateway

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి కలకలం

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి మృతి కలకలం
X

ఆర్టీసి సమ్మె రోజుకూ రోజుకూ ఉద్రిక్తంగా మారుతుంది. ఖమ్మంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దేవిరెడ్డి శ్రీనిసవారెడ్డి ఆదివారం నాడు తుది శ్వాస విడిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. తొంబై శాతం కాలిన గాయాలతో ఆయన ఆస్పత్రిలో చేరారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు తరలించారు. కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు.

దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, ప్రొఫెసర్‌ కోదండరాం ఆస్పత్రికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆస్పత్రి వద్దకు చేరుకుని శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారుశ్రీనివాస్‌రెడ్డి మృతి నేపథ్యంలో రేపు (సోమవారం) ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. శ్రీనివాసరెడ్డి మృతదేహన్ని ఖమ్మం తరలించారు.

Next Story
Share it