Telugu Gateway
Top Stories

రెండు వేల రూపాయల నోట్ల ముద్రణకు బ్రేక్!

రెండు వేల రూపాయల నోట్ల ముద్రణకు బ్రేక్!
X

వచ్చిన కొత్తలో ఆ నోట్లు తప్ప మరేమీ కన్పించలేదు. ఆ నోటు పట్టుకుని బయటకు వెళ్ళాలంటే కూడా భయమేసిన పరిస్థితి అది. ఎందుకంటే ఎవరు చూసినా బాబోయ్ మా దగ్గర చిల్లర లేదు పోండి అంటూ ఆ నోటు చూసి బెదిరిపోయేవారు. కొంత మంది అయితే తమ తమ షాప్ ల దగ్గర ఏకంగా నోటీసు బోర్డులు కూడా పెట్టారు. బిల్లు ఫలానా మొత్తం దాటితేనే రెండు వేల రూపాయల నోటు తీసుకుంటామని మరీ షాప్ ల దగ్గర అంటించారు. తర్వాతర్వాత రెండు వేల రూపాయల నోటు ఏమైందో కానీ పెద్దగా కన్పించకుండా పోయింది. ఇప్పుడు మార్కెట్లో భారీ ఎత్తున చలామణిలో ఉన్న పెద్ద నోటు కరెన్సీ ఏదైనా ఉంది అంటే అది ఐదు వందల రూపాయల నోట్లే. రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడ ఉన్నాయో కానీ చలామణిలో మాత్రం బాగా తగ్గిపోయాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతే కాదు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆర్ బిఐ కొత్తగా ఒక్కటంటే ఒక్క కొత్త రెండు వేల రూపాయల నోట్ ను కూడా ముద్రించ లేదట. ఓ మీడియా సంస్థ ఆర్ టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించింది. అయితే బడాబాబులు అందరూ తమ తమ బ్లాక్ మనీని ఈ నోట్లలోకి మార్చుకుని దాచుకున్నారనే ప్రచారం కూడా జోరుగా ఉంది.

సర్కులేషన్ లో ఈ నోట్లు అసలు కన్పించకుండా పోవటమే విచిత్రం. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో ఆరు కోట్ల రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ చర్య చేపట్టింది. ఆర్‌టీఐ సమాచారం ప్రకారం 2017లో రూ .2 వేల కరెన్సీ 3,542.991 మిలియన్ నోట్లను ముద్రించినట్లు ఆర్‌బిఐ తెలిపింది. 2018లో 111.507 మిలియన్ నోట్లు మాత్రమే ముద్రించారు. 2018-19లో ఈ సంఖ్య మరింత దిగజారి సగానికి పైగా పడిపోయి, 46.690 మిలియన్ల రూ.2వేల నోట్లను మాత్రమే తీసుకొచ్చింది. 2016 నవంబర్‌లో మోదీ సర్కార్ రూ.500, రూ.1000 నోట్లను అనూహ్యంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్త నోట్లతో దొంగ కరెన్సీని నివారించవచ్చని భావించినా..దీనికి అడ్డుకట్ట పడలేదని సమాచారం.

Next Story
Share it