Telugu Gateway
Latest News

వడ్డీ రేట్లు మళ్లీ తగ్గాయ్

వడ్డీ రేట్లు మళ్లీ తగ్గాయ్
X

కేంద్రం ఎలాగైనా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కార్పొరేట్ రంగానికి భారీ వరాలు ప్రకటించటంతోపాటు పలు సానుకూల చర్యలు కూడా చేపడుతోంది. దీంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బిఐ) కూడా తన వంతు సహకారం అందిస్తూ వస్తోంది. ఆర్ బిఐ వరస పెట్టి వడ్డీ రేట్లు తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలకు ఆర్ బిఐ సానుకూల చర్యలు కలసి దేశం ప్రగతిపథంలో పయనించగలదని ఓ అంచనాలు ఉన్నాయి. వీటి ఫలితం ఎలా ఉంటుంది అన్నది తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. తాజా సమీక్షలో ఆర్ బిఐ మరోసారి రెపో రేటును తగ్గించింది.

ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించి 5.15 శాతానికి తగ్గించింది. అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను కూడా సవరించారు. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో జీపీపీ 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. 2020-21 జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.2 శాతానికి పరిమితం చేసింది. ఆర్ధిక మందగమనం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులను పెంచేందుకు వడ్డీ రేట్లు తగ్గించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఆర్ బిఐ వడ్డీ రేట్లు తగ్గించటం ఇది ఐదవ సారి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో.

Next Story
Share it