Telugu Gateway
Andhra Pradesh

జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. అధికార వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసులు ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కాపాడతారని ప్రశ్నంచారు. ఇలాంటి వ్యక్తులతో రాష్ట్రానికి ఏమి న్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి అండతోనే ఆయన ఎమ్మెల్యేలు ఇష్టానుసారం దాడులు చేస్తున్నరని ఆరోపించారు పవన్ కళ్యాణ్. ప్రజల నమ్మకాన్ని వైసీపీ వమ్ము చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులు ఆర్ధిక నేరగాళ్ళు అయితే మనం భయంతో బతకాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాకు ఫ్లోరైడ్ లేని నీళ్ళు ఇస్తే గొప్ప విజయంగా భావిస్తానని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు అమరావతిలో ప్రకాశం జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 3న విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ తలపెట్టినట్లు వివరించారు.

“చేతిలో అధికారం లేనప్పుడు జగన్ ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అన్నారు. చిన్నాన్న హత్య కేసు, కోడి కత్తి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలన్నారు. అధికారం వచ్చాక మరి ఇప్పుడు ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ కేసుల విషయం మర్చిపోయారా? మీరు మర్చిపోయినా నేను మరిచిపోను.

శాంతి భద్రతలు కాపాడాల్సిన మీరు ఇలాంటి కన్వీనియెంట్ పాలిటిక్స్ చేయబట్టే నెల్లూరు జిల్లాకి చెందిన మీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జర్నలిస్ట్ మీదా, మహిళా అధికారి మీద దాడి చేసే ధైర్యం చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో మీ పార్టీకి చెందిన వ్యక్తి రోడ్డున వెళ్లే వ్యక్తిని పొడిచేయగలడు. మీరు క్రైం ప్రోత్సహిస్తుంటే మిమ్మల్ని అనుసరించే వారు అదే చేస్తారు. ఇది నా సొంత సమస్య కాదు. సమాజ సమస్య. మనం ఎన్నుకున్న వ్యక్తులు ఆర్ధిక నేరగాళ్లు అయితే మనం భయంతో బతకాల్ని వస్తోంది. నేను మాత్రం పిరికితనంతో ఉండను. సిఎం జగన్ రెడ్డి, చంద్రబాబుల మీద నాకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు. వారు నన్ను ఏం చేసినా పట్టించుకోను. వారి విధివిధానాల వల్ల ఓ సమూహానికి సమస్య వచ్చినప్పుడు మాత్రం చూస్తూ ఊరుకోను.’ అంటూ వ్యాఖ్యానించారు. వైసిపికి 151 సీట్లు వచ్చిన తర్వాత నాకు ఇంత త్వరగా రోడ్ల మీదకు రావల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. కానీ 151 సీట్లతో ప్రజలు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని పలుచన చేసేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి వచ్చినవి 2.8 ఓట్ల శాతం మాత్రమే. నన్ను నమ్మి ఓటేసిన ఆ పది మంది చాలు.

నేను ఒంగోలు వచ్చినప్పుడు పూల వర్షంతో నన్ను ఆహ్వానించారు. దాన్ని మీ ప్రేమ వర్షంగా నేను చూశాను. అక్కడ వలసలు ఆపాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రకాశం జిల్లాకు మంచి ప్రాజెక్టులు రావాలి. పరిశ్రమలు రావాలి. జిల్లాలో పరిస్థితి చూస్తే ఎమ్మెల్యే సీటు కోసం 150 కోట్లు డబ్బు ఖర్చు చేసే నాయకులు ఉన్నారుగానీ, రూ.10 వేలు సంపాదించి ఉన్న ఊరిలో బతుకుదామన్న యువత లేరు. ఉపాధి మార్గాలు వెతుక్కుంటూ ఇతర జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నా వంతుగా ఆయా జిల్లాల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి ఎవరికీ తలవంచకుండా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మన రాజకీయ ప్రస్థానం ఉంటుంది. ఎంతో మంది ఎంపిలు, ఎమ్మెల్యేలు వచ్చారు జిల్లాని నిర్లక్ష్యం చేశారు. అలాంటి నిర్లక్ష్యానికి గురికాకుండా మనకి అండగా ఉండే పరిస్థితులు తీసుకువస్తాను అని తెలిపారు.

Next Story
Share it