Telugu Gateway
Politics

తెలంగాణ బంద్ కు జనసేన మద్దతు

తెలంగాణ బంద్ కు జనసేన మద్దతు
X

జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ జెఏసీ పిలుపునిచ్చిన అక్టోబర్ 19 తెలంగాణ బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసైనికులు ఆర్టీసి కార్మికులకుఅండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 48 వేల మంది ఉద్యోగాలు తీసేస్తామనడం సబబు కాదన్నారు. అభద్రతా భావంతో ఉద్యోగులు చనిపోతున్నారు. సమస్య మరింత జఠిలం కాకుండా చూడాలని పవన్ కళ్యాణ్ కోరారు. అయితే బంద్ సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కార్మికుల తాలూకు ఆవేదనను తెలియపరుస్తూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరారు. సోమవారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, తాజా పరిస్థితులపై సమీక్ష జరిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "గత రెండు వారాలుగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చింది.

ఖమ్మం జిల్లాలో శ్రీనివాస్ రెడ్డి అనే కార్మికుడు కుటుంబ సభ్యుల ముందే తనను తాను తగులబెట్టుకుని చనిపోవడం, రాణిగంజ్ డిపోకి చెందిన సురేందర్ గౌడ్ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటనలు సమ్మె తీవ్రతను తెలియ చేస్తున్నాయి. కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వారి డిమాండ్లు ఎంత వరకు ఆమోదయోగ్యం అనే అంశాన్ని పక్కన పెట్టి వారి ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం. ఒకేసారి 48 వేల మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం ఓ పార్టీ అధ్యక్షుడిగా నాకే బాధ అనిపించింది. ఒకేసారి తీసేస్తున్నాం అనడం కార్మికుల కుటుంబాల్లోను ఆవేదన కలిగించింది. అందరిలోనూ చర్చనీయాంశం అయింది. కార్మికులు చేస్తున్న డిమాండ్స్ లో కొన్ని నెరవేర్చగలిగేవి ఉంటాయి. నెరవేర్చలేనివి ఉంటాయి. ప్రభుత్వం వారిని కూర్చొబెట్టి సామరస్య పూర్వకంగా పరిష్కరించగలిగినవి పరిష్కరించడంతో పాటు మిగిలిన అంశాలపై నచ్చజెప్పాలని సూచించారు.

Next Story
Share it