Telugu Gateway
Politics

చర్చలు లేవు..ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు

చర్చలు లేవు..ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు
X

తెలంగాణ సీఎం కెసీఆర్ ఆర్టీసి సమ్మె విషయంలో అదే వైఖరిపై ఉన్నారు. ఆర్టీసి కార్మిక సంఘాలతో చర్చలు లేవు...వాళ్లను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవటాలు లేవు అని మరోసారి తేల్చిచెప్పారు. అసలు సమ్మె చట్టవిరుద్ధం అయినప్పుడు..అలా చేసిన వారితో ప్రభుత్వం ఎందుకు చర్చిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసి సమ్మె వ్యవహారంపై కెసీఆర్ శనివారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని సిఎం ప్రకటించారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వర్తిస్తున్న వారికి సంబంధించిన సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

50 శాతం ఆర్టీసీ బస్సులు నడపడానికి అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని, 30 శాతం బస్సులను అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బస్సులు వందకు వంద శాతం పునరుద్ధరించడానికి కొద్ది రోజులు పట్టే అవకాశం ఉండడంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడిగిస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ‘‘ఆర్టీసీలో వందకు వందశాతం బస్సులను పునరుద్ధరించాలి. దీనికోసం అసవరమైన సిబ్బందిని వెంటనే తీసుకోవాలి. రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్లు, రిటైర్డ్ పోలీస్ డ్రైవర్లను ఉపయోగించుకోవాలి. బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం కలిగిన వారిని పనిలోకి తీసుకోవాలి. అధికారులు రేయింబవళ్లు పనిచేసి, మూడు రోజుల్లో వందకు వంద శాతం బస్సులు నడిచేలా చూడాలి’’ అని సిఎం ఆదేశించారు. ‘‘ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఆర్టీసీలో 50 శాతం (5,200) సంస్థ సొంత బస్సులు నడపాలి. ఇందుకు అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలి. 30 శాతం(3,100) అద్దె బస్సులు నడపాలి. ఇందులో ఇప్పటికే 21 శాతం ఉన్నాయి.

మరో 9 శాతం బస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. 20 శాతం(2,100) ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా రూట్ పర్మిషన్లు ఇవ్వాలి. దీనికోసం అవసరమైన కసరత్తు చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘యూనియన్ నాయకుల పిచ్చిమాటలు నమ్మి కార్మికులు అనధికారికంగా గైర్హాజరయి తమంతట తామే ఉద్యోగాలు వదులుకున్నారు. అంతే తప్ప ఎవరినీ ఎవరు డిస్మిస్ చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్ వైజర్లను కూడా సమ్మెలోకి లాగారు. యూనియన్ నాయకులు అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరించి 48 వేల మంది ఉద్యోగాలు పోయేలా చేశారు. విధులకు హాజరుకాని వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశమే లేదు. వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదు, ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, ఆర్టీసీని నష్ట పరిచిన కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు. అసలు వారు చేస్తున్నది సమ్మె కానే కాదు. అది చట్ట విరుద్ధమైన ప్రజలకు అసౌకర్యం కల్పించే చర్య మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. విధులకు హాజరైన ఉద్యోగులు, కార్మికుల సెప్టెంబర్ నెల జీతం వెంటనే విడుదల చేస్తాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

‘‘అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి చీత్కారం తప్పదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమిస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి విమర్శించారు.

Next Story
Share it