Telugu Gateway
Andhra Pradesh

లోకేష్ ది ‘డైటింగ్ దీక్ష’

లోకేష్ ది ‘డైటింగ్ దీక్ష’
X

ఏపీలో ఇసుక అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరు లో నారా లోకేష్ చేస్తున్నది ‘డైటింగ్ దీక్ష’ అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా భారీ ఎత్తున ఇసుక పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న నేతలా తమపై విమర్శలు చేసేది అని ప్రశ్నించారు. వరదల వల్లే ఇసుకకు ఇబ్బంది వచ్చింది తప్ప మరొకటి కాదన్నారు. వరదలు తగ్గగానే ప్రజలకు ఎంత కావాలంటే అంత ఇసుక సరఫరా సర్కారు రెడీగా ఉందన్నారు. అదే సమయంలో చంద్రబాబుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘చంద్రబాబు ఒక రాజకీయ దళారి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో లేకుంటే మంచిదని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.

రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారకుడు. ఆయన తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దివాళా తీయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వనరులు కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి అంశంలో ఒక పాలసీ ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఐదు నెలల సీఎం జగన్‌ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. సీఎం జగన్‌ మంచి పరిపాలన చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులను తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు వాడుకుంటున్నారు. కూలీలు, భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇస్తున్నాం. తప్పుడు మాటల వినొద్దు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మీ కుటుంబాల శ్రేయస్సు మా బాధ్యత.’ అని హామీ ఇచ్చారు.

Next Story
Share it