Telugu Gateway
Andhra Pradesh

విశాఖ వేదికగా ‘జనసేన లాంగ్ మార్చ్’

విశాఖ వేదికగా ‘జనసేన లాంగ్ మార్చ్’
X

ఏపీలో ఇసుక సమస్య..భవన కార్మికుల సమస్యలపై జనసేన పోరుబాట పట్టాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా నవంబర్ 3 లేదా 4 తేదీల్లో విశాఖపట్నంలో భారీ పాదయాత్ర (లాంగ్ మార్చ్) చేయాలని తలపెట్టింది. ఇసుక సమస్య కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది. ఇసుక సమస్యతోపాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అత్యంత కీలకమైన సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్న ఎన్నికల హామీని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని జనసేన ఆరోపించింది. రాజకీయ కక్షలతో అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుపట్టింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆదివారం నాడు జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్ కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, డా.పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పాదయాత్ర సమన్వయకర్తగా తోట చంద్రశేఖర్ ను నియమించారు. ఏపీ సర్కారు తెచ్చిన మద్యం విధానం తాగుడు తగ్గించేందుకు కాకుండా పెంచేలా ఉందని జనసేన విమర్శించింది. ఏపీలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాల జనసేన డిమాండ్ చేసింది.

జనసేన పార్టీ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వటంతోపాటు పార్టీ నిర్మాణంలో స్వల్ప మార్పులు చేయాలని తలపెట్టారు. తాజాగా జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయాలను నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. యువ నాయకత్వాన్ని తీర్చిదిద్ధేందుకు పార్టీపరంగా నిరంతర కార్యక్రమాల నిర్వహణకు రూపకల్పన చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించిందని... అందులో భాగంగా క్షేత్ర స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేయాలని సూచించారు. కార్తీక మాసంలో పర్యావరణ పరిరక్షణ కోసం పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరంగా, రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి పాలనాపరంగా విధానం లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులుపడటంతోపాటు... పలు రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఈ సమావేశంలో స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఇసుక సరఫరా ఇప్పటికీ సక్రమంగా లేకపోవడంతో 35 లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమైపోయి తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.

రాజధాని ప్రాంతంలో ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమైంది. అక్కడకు వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి దొరకడం లేదని ఎంతో ఆవేదన చెందారు. ఈ రంగం చుట్టూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వ్యాపారాలు నడుస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి ఉపాధి ఉంది. వీళ్లంతా రోడ్డునపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది కూలీలు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో చలనం రావాలి" అన్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో జనసేన నాయకులు, శ్రేణులపై రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని సభ్యులు ప్రస్తావించారు. అక్రమ కేసులు దాఖలు చేస్తూ కక్ష సాధించడం ప్రజాస్వామిక ధోరణి కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులతో పార్టీ శ్రేణులను, నాయకులను భయపెట్టాలని పాలక వర్గమే భావిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదన్నారు. శ్రేణులు, నాయకుల్లో మనోస్థైర్యాన్ని కల్పిస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ రాజకీయ దాడులను ఖండిస్తూ కమిటీ తీర్మానం చేసింది.

Next Story
Share it