Telugu Gateway
Andhra Pradesh

ఐదు నెలల్లో జగన్ ‘రెండు యూటర్న్ లు’

ఐదు నెలల్లో జగన్ ‘రెండు యూటర్న్ లు’
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ‘యూటర్న్’ బాబేనా?. ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు అత్యంత కీలకమైన రెండు హామీల విషయంలో ‘యూటర్న్’ లు తీసుకున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. అందులో ఒకటి రైతు భరోసా అయితే..మరోకటి ఏపీ రాజధాని. ఎన్నికల ముందు గెలవటం కోసం ఓ మాట..గెలిచిన తర్వాత మరో మాట మాట్లాడటంలో బహుశా దేశంలో ఏ నేత మినహాయింపు కాదేమో. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా నిరూపించుకున్నారు. ‘ఇదే క్యాపిటల్ సిటీలోనే విజయవాడ-గుంటూరుకు మధ్యలో..ఇదే సీఆర్ డీయే ప్రాంతాన్ని..ఇటు గుంటూరు..అటు విజయవాడ అనే రెండు పేర్లతో పిలిచే ఇదే సీఆర్ డీయేనే. మొట్టమొదటగా అటు నుంచి విజయవాడ అని వచ్చా.చివరకు గుంటూరూ అని కూడా ముగిస్తున్నా. కారణం ఏంటంటే చంద్రబాబునాయుడు ఎప్పుడూ అంటుంటారు.

జగన్ వస్తే క్యాపిటల్ ఇక్కడ ఉండదు అని.జగన్ వస్తే రాజధాని ఇక్కడ నుంచి పంపిస్తాడు అని. ఇదే చంద్రబాబునాయుడికి..ఇదే వేదిక నుంచి చెప్పటం కోసమే ఈ పేర్లు పిలిచా. ఇదే చంద్రబాబునాయుడికి అర్ధం కావటం కోసమే ఈ పేర్లు పిలిచా’ ఇదీ వైసీపీ ప్లీనరీలో జగన్ మాట్లాడిన మాటలు. అంతే కాదు..ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అమరావతి గురించి మేనిఫెస్టోలో కూడా పెడతాని ప్రకటించారు. మరి పార్టీ ప్లీనరీలో బహిరంగ వేదిక నుంచి అంత స్పష్టంగా అమరావతిపై హామీ ఇచ్చి..ఇప్పుడు కొత్తగా కమిటీ వేయటం ఎందుకు?. కమిటీ ఎక్కడ చెపితే రాజధాని అక్కడే అని బొత్స సత్యనారాయణ మాట్లాడటం వెనక మతలబు ఏమిటి?. ఎన్నికల ముందు జగన్ కు కాని...బొత్స సత్యనారాయణకు గానీ అక్కడ నేల గురించి అవగాహన లేదా?. ఇఫ్పుడు కొత్తగా అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పటం వెనక ఉద్దేశం ఏమిటి?. ఇది మాట తప్పటం కాదా?. అమరావతిని మార్చే ఉద్దేశం లేకపోతే కమిటీలు..కాలయాపనలు ఎందుకు?. ఇది రాజధాని విషయంలో జగన్ ‘యూటర్న్’ తీసుకున్నట్లు కాదా?.

రాజధాని విషయంతోపాటు ‘రైతు భరోసా’ విషయంలోనూ జగన్ మరో యూటర్న్ తీసుకున్నారు. రకరకాల సాకులు చెప్పి రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉండటానికి చంద్రబాబు ఐదేళ్ల సమయం తీసుకుంటే జగన్ ఐదు నెలల్లోనే ‘రైతు భరోసా‘ విషయంలో మరో ‘యూటర్న్’ తీసుకున్నాడు. తాము అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు 12500 రూపాయలు ఇస్తామని విస్పష్టంగా ప్రకటించారు. జగన్ ఈ పథకం ప్రవేశపెట్టే నాటికి కేంద్రంలో మోడీ సర్కారు పీఎం కిసాన్ యోజన పథకం ప్రకటన కూడా చేయలేదు. కానీ అమలు దగ్గరకు వచ్చే సరికి కేంద్ర పథకంతో రైతు భరోసాను జతచేయటంతోపాటు..విడతల వారీగా మార్చారు. ఇది జగన్ రెండో యూటర్న్ అని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు చంద్రబాబునాయుడిని ‘యూటర్న్’ నేతగా చిత్రీకరించారు. దీనికి కారణంగా చంద్రబాబు ముందు ఓ ప్రకటన చేయటం..తర్వాత దాన్ని మార్చుకోవటం. ఇప్పుడు జగన్ కూడా అదే జాబితాలో చేరుతున్నారు.

ప్లీనరీలో అమరావతిపై జగన్ మాట్లాడిన మాటల వీడియో

https://www.youtube.com/watch?v=z7NjKJFddHY

Next Story
Share it