Telugu Gateway
Politics

జగన్ నిర్ణయాలు...కెసీఆర్ కు ఇక్కట్లు

జగన్ నిర్ణయాలు...కెసీఆర్ కు ఇక్కట్లు
X

తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు..నీళ్ళు..నియామకాల కోసం. అన్నింటి కంటే ముఖ్యంగా నిరుద్యోగ యువత రాష్ట్రం వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని ఆశపడింది. ప్రస్తుత ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్రం ఏర్పాటు అయితే ఏకంగా లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయని పలుమార్లు ప్రకటించారు. రాష్ట్రం వచ్చింది..ఐదేళ్లు దాటిపోయింది. కానీ లక్ష ఉద్యోగాల సంగతి మాత్రం ఏమీ తేలలేదు. కానీ అందుకు భిన్నంగా ఏపీలో అక్కడి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకేసారి లక్షలాది ఉద్యోగాలు కల్పించి ఓ రికార్డు నెలకొల్పారు. ఒకేసారి 1.26 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి షాక్ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి నెలకు 15 వేల రూపాయల జీతంతో కూడిన ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఓ రికార్డే. తెలంగాణ విషయానికి వస్తే ఖాళీల భర్తీకి కూడా నోటిఫికేషన్లు వెలువడటం లేదు. వచ్చినా అవి కోర్టు కేసుల్లో చిక్కుకోవటం..వివాదాల్లో మునిగితేలుతున్నాయి.

అప్పుడప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నా అవి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చేలా ఉండటం లేదు. రాష్ట్రం వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయన్న తెలంగాణలో ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన జరగపోవటం ఒకెత్తు అయితే..ఏపీలో ఒకేసారి లక్షకుపైన ఉద్యోగాలు ఇవ్వటం తెలంగాణ యువతలో మరింత అసంతృప్తికి కారణం అవుతోంది. దీనికి తోడు ఏపీలో జగన్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం రేపుతోంది. రాజకీయ పార్టీలు అన్ని జగన్ ను చూసి అయినా కెసీఆర్ ఆర్టీసిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నాయి. ఆర్టీసి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ ఏపీలో జగన్ నిర్ణయాన్ని ..తెలంగాణలో కెసీఆర్ మొండి వైఖరిని పోల్చిచూపుతూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ అదే జరుగుతోంది.

ఏపీలో జగన్ ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దుకు నిర్ణయం తీసుకుని కమిటీ వేశారు. కానీ తెలంగాణలో అదేమీ జరగటం లేదు. దీనికి తోడు తెలంగాణలో పీఆర్సీ నివేదిక రావటం మరింత జాప్యం అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తెలంగాణలో (కెసీఆర్) స్విచ్ వేస్తే ఏపీలో వైసీపీ గుర్తు ఫ్యాన్ తిరుగుతుందని రాజకీయ విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కన్పిస్తోంది. ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు తెలంగాణలో కెసీఆర్ కు పెద్ద ఎత్తున చికాకులు తెచ్చిపెడుతున్నాయి. ఇద్దరు సీఎంల మధ్య స్నేహం బాగానే ఉన్నా జగన్ నిర్ణయాలు మాత్రం ప్రస్తుతం కెసీఆర్ కు మాత్రం కాక పుట్టిస్తున్నాయనే రాజకీయ పార్టీల నేతల వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it