కెసీఆర్ బాటలో జగన్
నెలకో ఓ సారే సచివాలయం సందర్శన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణ సీఎం కెసీఆర్ బాటలో పయనిస్తున్నారా?. అంటే ఔననే చెబుతున్నాయి ఏపీ అధికార వర్గాలు. సచివాలయం అంటే ముఖ్యమంత్రితోపాటు మంత్రులు..ఉన్నతాధికారులు..ప్రభుత్వ ఉద్యోగులు ఉండే ప్రాంతం. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాయలం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మంత్రివర్గ సమావేశం ఉంటేనో..లేదంటే నెలకోసారి మాత్రమే ఆయన సచివాయలంలోకి అడుగుపెడుతున్నారు. ఏ సమీక్ష అయినా..ఏ సమావేశం అయినా జగన్ తాడేపల్లిలో నిర్మించుకున్న క్యాంప్ ఆఫీస్ లోనే. ఇలా ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని నా ఇళ్లే సచివాలయం, నేను ఉన్నదే సీఎం కార్యాలయం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు. జగన్ క్యాంప్ కార్యాలయంలోకి ఆ రోజు సమావేశం ఉన్న శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు తప్ప మిగతా వారెవరినీ అనుమతించటంలేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. సమీక్షలకు సంబంధించిన శాఖ ఉన్నతాధికారులు ఎవరెవరు వస్తారు...ఎంత మంది అనే జాబితాను సెక్యూరిటీ సిబ్బందికి అందజేస్తారు.
వాళ్ళను మించి ఏ ఒక్కరిని లోపలికి అనుమతించటంలేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ లెక్కన ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలోకి నేరుగా వెళ్ళలేని పరిస్థితి. ఏదైనా సమస్య ఉంటే ఆయనకు నేరుగా చెప్పటం సాధ్యం కాదన్నట్లే లెక్క. ఒక్క ఉన్నతాధికారులే కాదు సొంత పార్టీ ఎమ్మెల్యేలదీ కూడా అదే పరిస్థితి. సమావేశం ఉంటేనో..లేదంటే అధికారికంగా పిలుపు వస్తే తప్ప ఎవరూ క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. సీఎం వారంలో కొన్ని రోజులు అయినా సచివాలయానికి వస్తే అక్కడ అందుబాటులో ఉంటారు కనుక అధికారులు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పుడు అదేమీ లేకుండా పాలన అంతా క్యాంప్ ఆఫీస్ నుంచే సాగిస్తుండటంతో అధికారులు కూడా మనకెందులే పిలిస్తే వెళదాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం సచివాలయానికి రావటంతో పాటు గత ముఖ్యమంత్రులు కొనసాగించిన సంప్రదాయం అయిన అందుబాటులో ఉన్న ప్రతి రోజూ ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం కొంత సమయం కేటాయించేవారు. కానీ జగన్ ఈ మోడడల్ కాకుండా కెసీఆర్ మోడల్ ను ఫాలో అవుతన్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి, సచివాలయానికి పెద్ద దూరం ఉందా? అంటే అదీ లేదు. జగన్ కూడా కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతున్నారని సాక్ష్యాత్తూ ఆయన మంత్రివర్గంలోని మంత్రులే అంతర్గత సంభాషల్లో వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అతివృష్టి అంటే కొన్ని రోజులు రాత్రి 11 గంటల వరకూ అక్కడే ఉండేవారు. ఇప్పుడు అనావృష్టి. జగన్ సచివాలయం వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు.