Telugu Gateway
Telangana

‘మెఘా’లో వందల కోట్ల హవాలా చెల్లింపులు!ఐటి శాఖ వెల్లడి

‘మెఘా’లో వందల కోట్ల హవాలా చెల్లింపులు!ఐటి శాఖ వెల్లడి
X

మెఘా ఇంజనీరింగ్ ఐటి దాడుల్లో భారీగానే బుక్ అయినట్లు కన్పిస్తోంది. ఐటి శాఖ అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటన పలు సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేగుతోంది. పారిశ్రామిక వర్గాలకంటే రాజకీయ వర్గాల్లోనే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ సంస్థ ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వాల్లో వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకుని ముందుకెళుతోంది. ఆ కంపెనీపై ఉన్న విమర్శలు సరేసరి. ఈ తరుణంలో ఐటి శాఖకు చెందిన బృందం వరసగా మూడు రోజుల పాటు హైదరాబాద్ తోపాటు ముంబయ్, ఢిల్లీల్లో కంపెనీకి చెందిన మొత్తం 30 కార్యాలయాల్లోనూ భారీ ఎత్తున సోదాలు జరిపింది. ఇంత వరకూ వివరాలు ఏమీ బహిర్గతం కాలేదు. తాజాగా ఐటి శాఖ అధికారిక నోట్ లో సంచలన విషయాలను బహిర్గతం చేసింది. అంతే కాదు..ఈ సంస్థకు సంబంధించిన లావాదేవీలపై పరిశోధన ఇంకా సాగుతుందని స్పష్టం చేసింది.

‘వందల కోట్ల రూపాయల హవాలా చెల్లింపులు. ఈ అక్రమ చెల్లింపులకు సంబందించిన ఆధారాలు..రికార్డుల సేకరణ. లెక్కలు తేలని 17.4 కోట్ల రూపాయల ఆస్తుల స్వాధీనం చేసుకున్నట్లు ఈ నోట్ తెలిపింది. మెఘా ఇంజనీరింగ్ పేరు ప్రస్తావించకుండానే ఐటి శాఖ స్పష్టంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మౌలికసదుపాయాలు, సాగునీరు, హైడ్రోకార్భన్స్, విద్యుత్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీకి చెందిన 30 ప్రాంతాల్లో ఐటి సోదాలు, సర్వే యాక్షన్స్ జరిగాయని తెలిపింది. బోగస్ వ్యయాలకు సంబంధించిన అంశంతోపాటు సబ్ కాంట్రాక్ట్ ల వ్యయం, ఇన్వాయిస్ లు ఎక్కువ చేసి చూపించటం వంటి అక్రమాలను గుర్తించారు.దీనికి సంబంధించిన పుస్తకాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పన్ను చెల్లించాల్సిన ఆదాయానికి సంబంధించి కూడా లెక్కల్లో మోసాలు చేసినట్లు గుర్తించినట్లు ఐటి శాఖ పేర్కొంది.

Next Story
Share it