Top
Telugu Gateway

ఒక్క నియోజకవర్గానికి వంద కోట్ల వరాలిచ్చారు..ఆర్టీసి కోసం 47 కోట్లు ఇవ్వలేరా?

ఒక్క నియోజకవర్గానికి వంద కోట్ల వరాలిచ్చారు..ఆర్టీసి కోసం 47 కోట్లు ఇవ్వలేరా?
X

ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికారులు అతి తెలిపి చూపిస్తూ కోర్టుకు అస్పష్ట నివేదికలు అందజేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసి అంశంపై హైకోర్టులో విచారణ సాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొంత గడువు ఇస్తే ప్రయత్నిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వ వాదనతో ఏకీభవించని ధర్మాసనం.. ఉపఎన్నిక జరిగిన చోట వంద కోట్ల రూపాయల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. ప్రభుత్వానికి ఒక్క నియోజకవర్గం ప్రజలు ముఖ్యమా? లేక రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్ల వరాలు ప్రకటించిన ప్రభుత్వానికి ప్రజల ఇబ్బందులు తొలగించడానికి రూ.47 కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆర్టీసీలో మొత్తం ఎన్ని బస్సులున్నాయి? ఇప్పుడు ఎన్నిబస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇతర బలహీన వర్గాలు ప్రయాణం చెయ్యాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమ్మెపై ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తోందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజల ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెప్తూనే బస్సులు లేక ఇబ్బంది పడతారని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. ఆర్టీసీ ఎండీ కోర్టు విచారణకు ఒక్కసారైనా హాజరు అయ్యారా? అని ప్రశ్నించింది.

75 శాతం బస్సులు తిరుగుతున్నాయని ప్రభుత్వ కోర్టుకు తెలపగా.. ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని హైకోర్టు పేర్కొంది. బకాయిలపై ప్రభుత్వం తరఫున కౌంటర్‌ దాఖలు చేసిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్టీసీ అప్పులు పంపకాలు జరగలేదని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు విన్న ధర్మాసనం.. రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌.. ఆర్టీసీకి సంబంధించిన అంశాలు విభజన చట్టంలోని 9వ షెడ్యుల్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీకి రూ. 4253 కోట్లు చెల్లించామని వివరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పామనలేదని, బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ప్రశ్నించింది. రూ.4253 కోట్లు ఇస్తే.. బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా క్యాటగిరి చేశారని, బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధుల్లో డిఫాల్టర్ మీరే కదా అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఉన్న వాస్తవాలను న్యాయస్థానం ముందు అధికారులు నిజాయితీగా ఒప్పుకోవాలి హై కోర్టు వ్యాఖ్యానించింది.

Next Story
Share it