Telugu Gateway
Telangana

అందరి ‘టార్గెట్’ రేవంత్ రెడ్డే!

అందరి ‘టార్గెట్’ రేవంత్ రెడ్డే!
X

రేవంత్ రెడ్డి. సహజంగానే అధికార పార్టీకి కీలక టార్గెట్. కాంగ్రెస్ పార్టీలో దూకుడు ప్రదర్శించే నేతల్లో మొదటి వరసలో ఉంటాడు. అందుకే ఆయనపై వేయికళ్ళు కాపు కాస్తూ ఉంటాయి. ఇందులో విశేషం ఏమీలేదు. కానీ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో ఏదైన ఒక పని చేసింది అంటే అది ‘ప్రగతి భవన్’ ముట్టడి కార్యక్రమమే. ఆర్టీసి సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరి సరిగాలేదంటూ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముగిసిన మరుసటి రోజే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో సర్కారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఏకంగా బేగంపేట మెట్రోస్టేషన్ మూసివేయటంతోపాటు..ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులను మోహరించింది. గతంలోఎన్నడూలేని రీతిలో కాంగ్రెస్ నేతలు కూడా కొంత వ్యూహాత్మంగా వ్యవహరించి అందరూ ఒకేసారి కాకుండా విడతల వారీగా వచ్చి ఓ హంగామా అయితే చేయగలిగారు. దీని ద్వారా కాంగ్రెస్ కూడా ఏదో ఒకటి చేస్తుందనే అభిప్రాయం ఏర్పడింది. వాస్తవానికి అత్యంత కీలకమైన ఆర్టీసి కార్మికుల సమస్యను కాంగ్రెస్ పార్టీ కంటే బిజెపినే ఎక్కువ ముందుకు తీసుకెళుతుందని..ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వెనకబడిందనే విమర్శలు ఉన్నాయి.

ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు నివ్వటంతో ద్వారా కొంతలో కొంత కాంగ్రెస్ కూడా రంగంలోనే ఉందనే అభిప్రాయం తేగలిగారు. అంతే కాదు..రేవంత్ రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుని బైక్ పై ప్రగతి భవన్ వరకూ వచ్చి మీడియా దృష్టిని ఆకర్షించారు. అయితే దీనికి సంబంధించిన వార్తలు ఓ పత్రికల్లో తప్ప..మిగిలిన వారు చాలా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. మీడియా, అధికార పార్టీ కంటే రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నుంచే సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. రేవంత్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నాడు సమావేశం పెట్టుకోవటం..దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయలాని నిర్ణయించటం ఆ పార్టీ శ్రేణులను కూడా షాక్ కు గురిచేస్తుంది.

అసలు కాంగ్రెస్ పార్టీని వీళ్ళంతా ఎటు తీసుకెళదామనుకుంటున్నారు అంటూ కొంత మంది నేతలు మండిపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలెవరినీ సంప్రదించకుండా ప్రగతిభవన్ ముట్టడికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారంటూ పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎవరిని సంప్రదించి ప్రగతి భవన్ ముట్టడి ప్రకటించారని నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తమకు కనీసం సమాచారం అయినా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ్ కేవలం మీడియాకు నోట్ రిలీజ్ చేశారంటూ సీనియర్లు రుసరుసలాడుతున్నారు. ఇదే విషయమై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సంపత్, వి.హనుమంతరావు, కోదండరెడ్డి సమావేశం అయి చర్చించారు.

Next Story
Share it