Telugu Gateway
Politics

అమిత్ షాతో కెసీఆర్ భేటీ

అమిత్ షాతో కెసీఆర్ భేటీ
X

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ శుక్రవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షా హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరి భేటీ ఇదే మొదటిది. గతంలో ఓ సారి రాజకీయంగా అమిత్ షాపై కెసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల కూడా మోడీ, అమిత్ షాలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోవాలని కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో బిజెపి గతంలోఎన్నడూలేని రీతిలో దూకుడు ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తాము అధికారంలోకి రావాలని సన్నాహాలు చేసుకుంటోంది. శాసనసభాపక్షాల విలీనం పేరుతో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలను కెసీఆర్ దెబ్బకొట్టగా..ఇదే అదనుగా బిజెపి తన ప్రయత్నాలు తాను చేస్తోంది.

ఈ తరుణంలో కెసీఆర్, అమిత్ షాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో కలసి సంయుక్తంగా నిర్మించతలపెట్టిన కృష్ణా – గోదావరి నదుల అనుసంధానం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ ప్రాజెక్టు హోదా తమకు ఎప్పటికీ ప్రాధాన్య అంశమేనని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ భేటీ అమిత్‌ షా, కేసీఆర్‌ల మధ్య దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది.

Next Story
Share it