Telugu Gateway
Andhra Pradesh

జగన్ తక్కువ మాట్లాడి..ఎక్కువ పనిచేస్తారు

జగన్ తక్కువ మాట్లాడి..ఎక్కువ పనిచేస్తారు
X

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. తమ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్కువ మాట్లాడి..ఎక్కువ పనిచేస్తారని వ్యాఖ్యానించారు. జగన్ పాలన చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు పథకాలను తామే ముందు తీసుకొచ్చామని అబద్దాలు చెబుతున్న చంద్రబాబుకు కంటిచూపు మందగించినట్లుందని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో తాత్కాలికంగా కట్టిన సచివాలయాన్నే చంద్రబాబు గ్రామ సచివాలయ వ్యవస్థ అనుకున్నారేమోనని ఎద్దేవా చేశారు.

టీడీపీ హయాంలో తప్పులు చేసిన చింతమనేనిపై ఒక్క కేసు అయినా రిజిస్టర్‌ చేశారా అని చంద్రబాబును ప్రశ్నించారు. కాల్‌మనీ కేసులో అభియోగాలు వచ్చిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. విశాఖ పార్టీ మీటింగ్‌లో కరెంట్‌ పోయిందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు స్థాయి మరచి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు. విశాఖలో భూ రికార్డులను తారుమారు చేసింది టీడీపీ నాయకులు కాదా అని ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసిన చంద్రబాబు.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Next Story
Share it