Telugu Gateway
Andhra Pradesh

‘వైఎస్ఆర్ నవోదయం’ పేరుతో ఎంఎంఎస్ఈ రంగానికి తోడ్పాటు

‘వైఎస్ఆర్ నవోదయం’ పేరుతో ఎంఎంఎస్ఈ రంగానికి తోడ్పాటు
X

ఏపీలో వైసీపీ సర్కారు భారీ పరిశ్రమల కంటే చిన్న, మధ్యతరహా పరిశ్రమలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. భారీ పరిశ్రమలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చే బదులు ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహిస్తే సత్ఫలితాలు వస్తాయని సర్కారు అంచనా వేస్తోంది. అందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ‘వైఎస్ఆర్ నవోదయం’ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ పథకం కింద పలుమార్గాల్లో ఎంఎస్ఎంఈ సంస్థలకు తోడ్పాటు అందించనున్నారు. ఈ పథకం ప్రారంభోత్స కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సుమారు 80,000 యూనిట్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయని అంచనా. లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ పథకం కింద ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత కలిగిన సంస్థలు ఒకసారి రుణాల పునర్ వ్యవస్థీకరణ (ఓటీఆర్)కు సాయం అందించనున్నారు. దీంతోపాటు గరిష్టంగా అంటే రెండు లక్షల రూపాయల వరకూ ఆడిటర్స్ రుసుం చెల్లించనున్నారు. ఇప్పటికే ఎన్ పీఏలు గా గుర్తించిన వాటిని ప్రోత్సాహకాల విడుదలకు ప్రాధాన్యత ఇచ్చి రుణాల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ఈ రంగం అభివృద్ధి చేపట్టాల్సిన చర్యలు...నూతన విధానాలు వంటి వాటిపై ఫోకస్ పెట్టనుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసి అర్హత గల సంస్థలకు పథకం ద్వారా ప్రయోజనం కల్పించాలని నిర్ణయించారు.

Next Story
Share it