Telugu Gateway
Cinema

వేణుమాధవ్ కన్నుమూత

వేణుమాధవ్ కన్నుమూత
X

వేణుమాధవ్. టాలీవుడ్ లో ఆయన పేరు తెలియని వారుండరు. దశాబ్దానికి పైగా తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్ గా, హీరోగా పలు పాత్రల్లో నటించిన వేణుమాధవ్ బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్‌ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు. బుధవారం మధ‍్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. వేణు మాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. వేణుమాధవ్‌ స్వస్థలం నల్గొండ జిల్లా కోదాడ.

1997 సంవత్సరంలో సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన ఆయనకు ‘తొలిప్రేమ’ చిత్రంతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘లక్ష్మి’ చిత్రంలో నటించిన పాత్రకు వేణు మాధవ్‌కు నంది అవార్డు వరించింది. వేణు మాధవ్‌ మృతిపట్ల టాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన సినీ పరిశ్రమలో పలు వినూత్న పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సంప్రదాయం సినిమాతో ఆయన సినీ కెరీర్ ప్రారంభం అయింది. వేణుమాధవ్ నటించిన చివరి సినిమా రుద్రమదేవి. రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ప్రయత్నించినా ముందడుగు వేయలేకపోయారు.

Next Story
Share it