Telugu Gateway
Politics

కెటీఆర్ పై ఉత్తమ్ ఫైర్

కెటీఆర్ పై ఉత్తమ్ ఫైర్
X

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కెటీఆర్ పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ గెలుస్తుంటే ఎందుకు కాంగ్రెస్ నాయకులను కొంటున్నారని ప్రశ్నించారు. కెటీఆర్ చెప్పింది బోగస్ సర్వే అని ఆరోపించారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధర్మానికి, ధర్మానికి, అవినీతి, అరాచకానికి, న్యాయానికి మధ్య పోరాటమని వ్యాఖ్యానిచంచారు. హుజూర్‌నగర్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. పోలీసులను అడ్డంపెట్టుకొని టీఆర్‌ఎస్‌ నాయకులు గలీజు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు కేసులు పెట్టి జైళ్లపాలు చేస్తున్నారని, డబ్బులతో కాంగ్రెస్ నేతలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ అయ్య ఇచ్చిన పదవులతో విర్రవీగకు అని కెటీఆర్ ను హెచ్చరించారు. మీలాగా కుటుంబ, కుల, గలీజు రాజకీయాలు తాను చేయలేదన్నారు. తరచూ నోరుజారే రాజకీయ బచ్చా కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథలో ఎన్ని కోట్లు దోచుకున్నారో కేటీఆర్‌ ప్రజలకు చెప్పాలని అన్నారు.

కేటీఆర్‌ది బోగస్ సర్వే అని, 14 శాతం అధిక్యం ఉంటే కాంగ్రెస్ నేతల కోసం వెంపర్లాడటం ఎందుకు అని ప్రశ్నించారు. హుజూర్‌నగర్ టికెట్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం యామారానికి చెందిన ఆంధ్రా వ్యక్తికి ఎలా ఇచ్చారని టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాజకీయాన్ని వ్యభిచారం చేస్తున్నారని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు తన్ని వెళ‍్లగొట్టితే గుత్తాను తమ సొంత డబ్బులతో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేశామన్నారు. కౌన్సిల్ చైర్మన్ అయిన గుత్తా దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని, దీనిపై ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. హుజూర్‌ నరగ్‌ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక పోలీసులపై నమ్మకం లేదని, కేంద్ర బలగాలను రప్పించాలని డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఒక తెలంగాణ ఆడబిడ్డనైన తనను ఓడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇక్కడే మోహరించిందని విమర్శించారు.

Next Story
Share it