హుజూర్ నగర్ ఉప ఎన్నిక....టెన్షన్ లో టీఆర్ఎస్!

ఒక్క ఉప ఎన్నిక కోసం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ టెన్షన్ పడుతుందా?. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. రెండవ సారి అప్రతిహత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ..ఓ ఉప ఎన్నిక కోసం చివరకు సీపీఐ మద్దతు కోసం ఆ పార్టీ దగ్గరికి వెళ్ళటం దేనికి సంకేతం?. తెలంగాణలో సీపీఐ బలమే నామమాత్రం. గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలుచుకోలేదు. పేరుకే పార్టీ కాని..ఆ పార్టీకి క్యాడర్, లీడర్లూ నామమాత్రమే. అలాంటి సీపీఐ దగ్గరకు టీఆర్ఎస్ నేతల బృందం వెళ్ళి మరీ సీపీఐ మద్దతు కోరారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. మామూలు రోజుల్లో అయితే సీపీఐతోపాటు ఏ ఇతర పార్టీ నేతలకు కూడా సీఎం కెసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. సహజంగా ఉప ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనే ఎన్నోసార్లు నిరూపితం అయింది. ఆర్ధిక, అంగబలం ఉండటం కూడా దీనికి ప్రధాన కారణం. ఓ ఉప ఎన్నిక కోసం అధికార టీఆర్ఎస్ మండలాల వారీగా మరీ భారీ ఎత్తున నేతలు మొహరించింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నిక కావటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీటు నిలబెట్టుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది.
బిజెపి, టీడీపీ, సీపీఎంతోపాటు సర్పంచ్ లు భారీ ఎత్తున ఎన్నికల రణరంగంలోకి దిగుతుండటంతో అధికార టీఆర్ఎస్ కు టెన్షన్ ప్రారంభం అయిందనే చెప్పొచ్చు. నిజామాబాద్ లో జరిగిన పరిణామాలు అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతుల తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు జాయింట్ చెక్ పవర్ ను వ్యతిరేకిస్తూ సర్పంచ్ లు పెద్ద ఎత్తున హుజూర్ నగర్ ఉప ఎన్నికలో నామినేషన్లు వేసేందుకు రెడీ కావటం టీఆర్ఎస్ కు పెద్ద చికాకుగా మారింది. ఈ పరిణామాలతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫలితం తెలంగాణ రాజకీయాలపై ఇఫ్పటికిప్పుడు పెద్దగా ఎలాంటి ప్రభావం చూపించకపోయినా భవిష్యత్ పరిణామాలకు మాత్రం ఓ సంకేతంగా నిలుస్తుందని భావిస్తున్నారు.