Telugu Gateway
Cinema

భగత్ సింగ్ అనుకున్నా..సైరా కుదిరింది

భగత్ సింగ్ అనుకున్నా..సైరా కుదిరింది
X

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తన కల నెరవేరింది అంటున్నారు. తన కెరీర్ లో ఏదైనా స్వాతంత్ర సమరయోధుడి చరిత్రతో సినిమా చేయాలని కోరుకున్నట్లు తెలిపార. భగత్ సింగ్ సినిమా అనుకుంటే తనకు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వంటి స్వాతంత్ర సమరయోధుడి సినిమా చేసే ఛాన్స్ దక్కిందని అన్నారు. ఆదివారం నాడు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగిన సైరా ప్రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడారు. ‘‘సెప్టెంబర్‌ 22 నా జీవితంలో అద్భుతమైనటువంటి ల్యాండ్‌ మార్క్‌. 1978 సెప్టెంబర్‌ 22న నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజు. ఓ వైపు టెన్షన్‌.. మరోవైపు ఎగ్జయిట్‌మెంట్‌.. ఇలా రకరకాల అనుభూతులతోటి నేను నేలమీదలేనంటే ఒట్టు. ఇన్నేళ్ల తర్వాత అలాంటి అనుభూతి ఈరోజు అనుభవిస్తున్నానన్నది వాస్తవం. దానికి కారణం ‘సైరా నరసింహారెడ్డి’’ అని వ్యాఖ్యానించారు. చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదలవుతోంది. ‘‘ఏ కథ అయినా అనుకుని అద్భుతంగా అల్లుకుని సెట్స్‌ పైకి తీసుకెళతాం. కానీ, ‘సైరా’ అలాంటిది కాదు.

దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం నుంచి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే 25 ఏళ్లకి ముందు ‘మీరు చేయాల్సిన పాత్రలేమైనా ఉన్నాయా?’ అని అడిగితే ఎప్పుడూ అంటుంటాను. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలి.. ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి.. నా కెరీర్‌కి అది బెస్ట్‌ పాత్ర అవ్వాలి అది భగత్‌సింగ్‌’ అంటూ నేను చెప్పుకుంటూ వచ్చేవాణ్ణి. కానీ ఎందుకో భగత్‌సింగ్‌ పాత్రని రచయితలు, దర్శకులు, నిర్మాతలు తీసుకురాలేదు.. దాంతో ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత, పుష్కరానికి ముందు పరుచూరి బ్రదర్స్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. ఆయన గురించి కర్నూలుతో పాటు చుట్టుపక్కన ఉన్న జిల్లాల్లోని కొందరికి తప్ప ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆ టైమ్‌లో నాకూ పెద్దగా తెలియలేదు. నాకు తెలిసినవారిని అడిగినా మాకూ తెలియదన్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని పేజీలు, బుర్ర కథలు, ఒగ్గు కథలున్నాయి తప్ప ఆయన గురించి పెద్దగా ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ, కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఓ గొప్ప యోధుడు అనిపించింది.

తెరమరుగైపోయిన, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి కథని అందరికీ తెలియజేయాలని సినిమా తీశాం. 1857లో సిపాయుల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగళ్‌పాండే, ఝాన్సీ లక్ష్మీభాయ్‌ గురించి తెలుసు. ఆ తర్వాత ఆజాద్, భగత్‌సింగ్, నేతాజీ... ఇలా ఒక్కరేంటి.. మహాత్మాగాంధీ వరకూ ఎంతో మంది యోధులు, త్యాగమూర్తుల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాం. అయితే మన తెలుగువాడైన నరసింహారెడ్డివంటివారి కథ తెరమరుగైపోకూడదు అని మైండ్‌లో గట్టిగా ఉండిపోయింది. ఇలాంటి కథ కోసమే కదా ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను.. మనం సినిమా చేస్తున్నాం అని పరుచూరి బ్రదర్స్‌ కి చెప్పా. అయితే ఈ కథని తెరకెక్కించి న్యాయం చేయాలంటే బడ్జెట్‌ సమస్య అని మాకందరికీ అనిపించింది. పది–పదిహేనేళ్ల కిత్రం నాపై 30–40 కోట్లతో సినిమాలు తీసే రోజుల్లో ‘సైరా’ సినిమాకి 60–70 కోట్లపైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు.. చేయమని మనం అడగలేం.

ఎందుకంటే నష్టపోయే పరిస్థితి. కానీ, చూద్దాం.. చేద్దాం.. రాజీపడలేం అనుకున్నాం. ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో ఆగిపోయింది. కానీ, నా 151వ సినిమాగా ‘సైరా’ చేస్తే ఎలా ఉంటుందన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇన్‌డైరెక్ట్‌ గా సపోర్ట్‌ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన ‘బాహుబలి’ తీసి ఉండకపోతే ఈరోజు ‘సైరా’ వచ్చుండేది కాదు.. మన తెలుగు సినిమాకి భారతదేశమంతా ఓ దారి వేశారాయన. ఇన్ని వందల కోట్లు మనం ఖర్చు పెట్టినా సంపాదించుకోవచ్చు.. నిర్మాతలకి నష్టం లేకుండా చూడొచ్చు అని భరోసా ఇచ్చాడు రాజమౌళి. శభాష్‌.. హ్యాట్సాఫ్‌ టు రాజమౌళి. ‘ఇంతఖర్చు పెట్టి రిస్క్‌ చేయమని ఎవరికైనా ఎందుకు మనం చెప్పాలి.. రాజీ పడకుండా మనమే చేద్దాం’ అని చరణ్‌ అనడంతో సై అన్నాను అని తెలిపారు.

Next Story
Share it