Telugu Gateway
Politics

చిన్మయానందపై కేసు పెట్టిన విద్యార్ధిని అరెస్ట్

చిన్మయానందపై కేసు పెట్టిన విద్యార్ధిని అరెస్ట్
X

ఇదో కొత్త కోణం. పెద్దలపై కేసు పెడితే అంతే. సడన్ గా కొత్త కేసులు పుట్టుకొస్తాయి. కేసు పెట్టిన వారిని కూడా అరెస్ట్ చేస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు బయటకు వస్తారు కాని..అమాయకులు మాత్రం కష్టాల పాలు అవుతారు. అలాంటిదే ఈ వ్యవహారం. కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద లైంగిక వేదింపుల కేసులో ఇదో కొత్త ట్విస్ట్‌. చిన్మయానంద తనను లైంగికంగా వేదించారంటూ ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్‌ న్యాయ విద్యార్థినిని పోలీసులు బుధవారం నాడు అరెస్ట్‌ చేశారు. కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్‌.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతో మసాజ్ చేయించుకున్నాడని న్యాయవిద్యార్థిని పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిట్ బృందం రెండురోజుల క్రితం చిన్మయానందను అరెస్టు చేసింది. అత్యాచారం కేసులో బాధితురాలైన న్యాయ విద్యార్థిని డబ్బులు గుంజేందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందనే ఫిర్యాదు మేర సిట్ ఆమెపై కూడా కేసు నమోదు చేసి బాధితురాలిని అరెస్టు చేసింది. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్మయానంద కేసుతో పాటు బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలైన తనకు బ్లాక్ మెయిల్ కేసులో అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ న్యాయవిద్యార్థిని కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు గురువారం దర్యాప్తు చేయనుండగా బుధవారం సిట్ ఆమెను అరెస్టు చేయడం విశేషం. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం చేత విచారణ ఎదుర్కొన్న చిన్మయానందను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సిట్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ముందు చిన్మయానంద్‌ను హాజరుపరచగా 14 రోజుల పాటు జైలుకు తరలించింది.

Next Story
Share it