Telugu Gateway
Andhra Pradesh

కోడెల పోస్టుమార్టంలో తేలింది ఏంటి?

కోడెల పోస్టుమార్టంలో తేలింది ఏంటి?
X

స్వతహాగా డాక్టర్ అయిన కోడెల శివప్రసాద్ రావు 72 సంవత్సరాల వయస్సులో ఆత్మహత్య చేసుకుంటారా?. గతంలో ఎన్నడూలేని రీతిలో కోడెల ఫ్యామిలీని వివాదాలు చుట్టుముట్టాయి. తీవ్రమైన అవినీతి ఆరోపణలు..కుటుంబ సభ్యులపై కేసులు వంటి పరిణామాలతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. స్పీకర్ గా ఉండి గతంలోఎవరూ లేనంతగా కోడెల తన ప్రతిష్టను కోల్పోయారనే చెప్పాలి. కోడెల మరణానికి సంబంధించి మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. కొన్ని ఛానళ్ళు కోడెలకు గుండెపోటు వచ్చిందని..మరికొన్ని ఛానళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని ప్రసారం చేశాయి. వీటిని ఆసరా చేసుకుని రాజకీయ పార్టీలు ఎవరి వాదన వారు సిద్ధం చేసుకున్నారు. ఆత్మహత్య, గుండె నొప్పి అయితే బసవతారకం ఆస్పత్రికి ఎలా తీసుకెళతారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. టీడీపీ నేతలు మాత్రం జగన్ సర్కారు రాజకీయ వేధింపుల వల్లే కోడెల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ తరుణంలో ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక వివరాలు బహిర్గతం అయ్యాయి.

ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఇతర అనుమానాలు అన్నీ పటాపంచలు అయి..ఆయన ఉరి వేసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు అయింది. దీంతో రాజకీయ విమర్శలకు చెక్ పడినట్లు అయింది. పోస్ట్‌ మార్టం అనంతరం కోడల భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు తరలించారు. మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్‌ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్‌ ఏర్పాటు అయింది. సిట్‌ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్‌ టీమ్‌ కూడా పలు ఆధారాలను సేకరించింది. కోడెల అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి.

Next Story
Share it