కోడెల బిజెపిలో చేరాలనుకున్నారా?
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బిజెపిలో చేరాలనుకున్నారా?. ఈ దిశగా కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడి ఉందని టీడీపీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఏపీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ దీనికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. కోడెల అసలు బీజేపీలో చేరాలని ఎందుకు ప్రయత్నించారు? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు ఫిర్యాదు చేశారు? కోడెల సెల్‌ఫోన్ మాయంపై బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు.
కోడెల మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోడెల చనిపోయారన్న కనీస సానుభూతి లేకుండా రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలని బాబు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో సీబీఐ రాకూడదన్న చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంపై సీబీఐ దర్యాప్తునకు ఎలా డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు.