Telugu Gateway
Politics

కెసీఆర్ సడన్ సర్ ప్రైజ్

కెసీఆర్ సడన్ సర్ ప్రైజ్
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ అందరికీ సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఓ వైపు సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఆదివారం నాడు మంత్రివర్గ విస్తరణకు శ్రీకారం చుట్టారు. అప్పటివరకూ ఎవరికీ ఈ విషయంలో పెద్దగా అలికిడి లేదు. అయినా అసెంబ్లీ ముందు మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేస్తారులే అని అంతా అనుకుంటున్న దశలో కెసీఆర్ మాత్రం..నేను అందరిలా ఆలోచించను..నా స్టైల్ డిఫరెంట్ అన్న తరహాలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణే ఉంటుందా?. లేక ఉద్వాసనలు కూడా ఉంటాయా?. ఇవీ సస్పెన్స్. కెసీఆర్ తన సహజశైలిలో ఉండి ఉంటే..ధిక్కార స్వరం విన్పించిన ఈటెల రాజేందర్ పై వేటుపడుతుంది. లేదు..ప్రస్తుతం రాజకీయ వాతావరణం అనుకూలంగా లేదు అనుకుంటే కొంత కాలం వేచిచూసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆదివారం మధ్యాహానికి అసలు విషయం తేలనుంది. ఈటెలపై వేటు వేస్తే మాత్రం రాజకీయంగా అది పెద్ద నిర్ణయమే అవుతుంది.

రాబోయే రోజుల్లో ఆ ప్రభావం పార్టీపై కూడా ఉంటుందని అంతర్గత అంచనాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళను పక్కన పెట్టి మధ్యలో పార్టీలో చేరిన వారికి పెద్ద పీట వేస్తున్నారనే విమర్శలు గత కొంత కాలంగా పెరిగాయి. అయితే తాజా విస్తరణలో మాజీ మంత్రులు కెటీఆర్, హరీష్ రావులకు బెర్త్ ఖాయం అని చెబుతున్నారు. మహిళల్లో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇస్తున్నారు అంటే ఈటెలపై వేటు ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చూడాలి మరి ఆదివారం సాయంత్రానికి ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో. ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్ కు ఈ సారి అవకాశం దక్కుతుందని అంచనా. తొలుత మాజీ మంత్రి తుమ్మల పేరు ప్రచారంలోకి వచ్చినా ఇప్పుడు అది వెనక్కిపోయింది.

Next Story
Share it