Telugu Gateway
Politics

జగన్ ను కెసీఆర్ ఫిక్స్ చేస్తున్నారా?!

జగన్ ను కెసీఆర్ ఫిక్స్ చేస్తున్నారా?!
X

ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సోమవారం నాడు హైదరాబాద్ వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్ నాలుగు గంటల పాటు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ ప్రధాన పత్రికలో ఇద్దరు సీఎంలు కేంద్రం తీరు, బిజెపి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ పెద్ద కథనం వచ్చింది. దీనిపై ఏపీ సీఎంవో వెంటనే వివరణ ఇచ్చింది. అసలు కేంద్రం గురించి..బిజెపి గురించి తమ మీటింగ్ లో ఏమీ చర్చించలేదని..ఇది దురుద్దేశపూర్వక కథనం అని పేర్కొంది. అదే సమయంలో తెలంగాణ సర్కారు నుంచి మాత్రం ఎలాంటి వివరణ లేదు. జగన్ కేంద్రంతో ప్రస్తుతానికి సఖ్యతే కోరుకుంటున్నాడు. ఎలాంటి ఘర్షణ వైఖరితో ముందుకు వెళ్ళే ఉద్దేశంలో లేరు. కానీ తెలంగాణ సీఎం కెసీఆర్ పరిస్థితి మాత్రం అది కాదు. తెలంగాణలో బిజెపి ఇప్పుడు టీఆర్ఎస్ కు పెద్ద సవాల్ విసురుతోంది. ఎన్నికల నాటికి మరింత బలోపేతం అవటమే కాకుండా..అదికారంలోకి రావటానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇది ఎంత వరకూ సఫలీకృతం అవుతాయని అనేది వేచిచూడాల్సిందే. అదే సమయంలో బిజెపితో, మోడీ సర్కారుతో గత కొంత కాలంగా కెసీఆర్ విభేదిస్తున్నారు. రెండవ సారి మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీళ్లిద్దరి మధ్య సంబంధాలు ఏమంత సఖ్యతగా లేవన్నది అందరికీ తెలిసిందే.

కేంద్రంలో మోడీ ప్రస్తుతం అత్యంత శక్తివంతంగా ఉన్నారు. వాస్తవానికి కెసీఆర్, జగన్ లు ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెద్దగా సాధించగలిగేది కూడా ఏమీ లేదు. మోడీని, అమిత్ షాను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మమతా బెనర్జీ కూడా తాజాగా ఢిల్లీలో ఇద్దరితో సమావేశం అయిన పరిస్థితి. ఈ తరుణంలో ఇద్దరు సీఎంల సమావేశంలో రాజకీయ పరమైన అంశాలను ఎవరు లీక్ చేశారు?. వీటి వల్ల కెసీఆర్ కు పెద్దగా నష్టం లేదు. కానీ కేంద్రంతో ఏ మాత్రం ఘర్షణకు సిద్ధంగా లేని జగన్ కు ఇబ్బందికర పరిణామమే. ఓ రకంగా కెసీఆర్ ఈ సమావేశం ద్వారా జగన్ ను ‘ఫిక్స్’ చేశారనే ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ పరిణామం నుంచి బయటపడేందుకు ఏపీ సీఎంవో కార్యాలయం వివరణ ఇచ్చిందని చెబుతున్నారు. పత్రికలో వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేకపోతే తెలంగాణ సీఎంవో కూడా స్పందించాలి కదా?. కానీ వీళ్ళ మౌనం వెనక మర్మమేంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it