Telugu Gateway
Andhra Pradesh

విమర్శలు చేస్తే అరెస్ట్ లు చేస్తారా?

విమర్శలు చేస్తే అరెస్ట్ లు చేస్తారా?
X

వైసీపీ సర్కారుపై జనసేన పార్టీ మండిపడింది. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్ట్ లు చేస్తారా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు మర్చిపోయారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తను విడుదల చేయాలని..లేదంటే ఏపీలోని పోలీసు స్టేషన్ల వద్ద శాంతియుత ఆందోళనలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించారని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన వాసా శ్రీనివాసరావు అనే జనసేన కార్యకర్తను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసుశాఖ పై జనసేన పార్టీకి, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అపారమైన గౌరవం ఉందన్నారు. పోలీసుల చర్య వాక్ స్వతంత్రాన్ని హరించి వేసేదిగా ఉందని అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో వ్యక్తం చేసే రాజకీయ విమర్శల ఆధారంగా ఎవరినీ అరెస్ట్ చేయరాదని స్వయంగా సుప్రీమ్ కోర్ట్ జారీచేసిన ఉత్తర్వులను సైతం మంగళగిరి పోలీసులు కాలరాశారన్నారు.

సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన ఒక రాజకీయ విమర్శపై ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపుగా కమిటీ అభిప్రాయపడింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆగస్టు 24 వ తేదీన వై.సి.పి.సోషల్ మీడియా విభాగం సోషల్ మీడియాలో రాసిన కట్టుకధలపై జనసేన నాయకులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు అదేరోజున చేసిన ఫిర్యాదుపై ఇంతవరకు చర్యలు తీసుకోని పోలీసులు కేవలం విమర్శ చేసిన శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేయడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలో పోలీస్ అధికారులు చెప్పాలి. శ్రీనివాసరావును తక్షణం విడుదల చేయాలి. ఇటువంటి అరెస్టులు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజాస్వామ్యయుతంగా పోలీస్ స్టేషన్ల వద్ద నిరసన తెలియచేస్తామని కమిటీ ప్రకటించింది. విమర్శలు చేసేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనసైనికులకు కమిటీ ఈ సందర్భంగా సూచించింది.

Next Story
Share it