Telugu Gateway
Cinema

అమితాబ్ ఇక ‘దాదా సాహెబ్’

అమితాబ్ ఇక ‘దాదా సాహెబ్’
X

బిగ్ బీ అమితాబ్ బచన్ కిరీటంలో మరో మైలురాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ పాల్కే అవార్డును అమితాబ్ కు ప్రకటించింది కేంద్రం. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమితాబ్‌ను పురస్కార కమిటీ ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 2019కి గాను అవార్డు అమితాబ్‌ బచ్చన్‌ను దక్కింది. 1942 అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్‌లో జన్మించిన అమితాబ్ హరివంశ్ బచ్చన్ భారతీయ సినిమాలో అత్యంత ప్రభావవంతమైన నటుడిగా పేరు పొందారు. 1970లలో విడుదలయిన జంజీర్, దీవార్ సినిమాలతో తనకంటూ ఓ ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. తన పాత్రలతో భారతదేశపు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. నాలుగు దశాబ్దాల్లో దాదాపు 190 సినిమాలలో ఆయన నటించి మెప్పించారు.

1970, 80, 90లలో తెరపై అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరాలోనూ బిగ్‌బీ నటిస్తున్నారు. ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు. ఉత్తమ నటుడు కేటగిరికిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్‌కు అతి ఎక్కువ సార్లు నామినేట్ అయిన నటుడుగా రికార్డు సృష్టించారు. నటునిగానే కాక, నేపధ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు. దాదా సాహెబ్ పాల్కే అవార్డు దక్కిన సందర్భంగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Next Story
Share it