Telugu Gateway
Telangana

హైదరాబాద్ లో ‘చబ్’ బిజినెస్ సర్వీస్ సెంటర్

హైదరాబాద్ లో ‘చబ్’ బిజినెస్ సర్వీస్ సెంటర్
X

హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలుగా పలు అంతర్జాతీయ కంపెనీలకు వేదికగా నిలుస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన బీమా కంపెనీ ‘చబ్’ హైదరాబాద్ లో బిజినెస్ సర్వీస్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్ లో హైదరాబాద్ తోపాటు బెంగుళూరులో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ బిజినెస్ సర్వీస్ సెంటర్లు ముఖ్యంగా కంపెనీ అంతర్జాతీయ కార్యకలాపాలకు అవసరమైన సహాయ, సహకారాలు అందించనున్నాయి. ముఖ్యంగా ఇవి ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ, డిజిటల్, అనలిటిక్స్ విభాగంలో సేవలు అందించనున్నాయి. ఈ సేవల కోసం అవసరం అయిన నిఫుణులను నియమించుకోనున్నట్లు చబ్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ సీన్ రింగ్ స్టెడ్ తెలిపారు. భారత్ లోని రెండు సెంటర్లలో కలుపుకుని తొలుత వంద మంది ఉద్యోగులు ఉంటారని తెలిపారు. హైదరాబాద్ లో గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంపెనీ ప్రతినిధులు ఈ వివరాలు వెల్లడించారు.

విదేశాల్లో ఇఫ్పటికే ఉన్న కంపెనీ కేంద్రాలకు భారత్ లో కొత్తగా ఏర్పాటు చేసే సెంటర్లు సహాయ, సహకారాలు అందించనున్నాయి. భారత్ లో నిపుణులను తీసుకునేందుకు వీలుగా చబ్ దేశానికి చెందిన టెట్రాసాప్ట్, బ్రిడ్జ్ i2iతో ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. పలు అంశాలపై చబ్ తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టి హబ్ తో కలసి పనిచేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చబ్ హైదరాబాద్ లో సొంత క్యాంపస్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఎదగాలని ఆకాక్షించారు. హైదరాబాద్ పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారుతోందని..ప్రభుత్వ పరంగా అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు తాము అందిస్తామని తెలిపారు.

Next Story
Share it