అమరావతి పై బుగ్గన వ్యాఖ్యల మర్మమేంటి?
ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ నూతన రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన అమరావతి నిర్మాణానికి డబ్బుల్లేవని వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయం విభజన చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీని కలసినప్పుడు అమరావతికి డబ్బులు అడగకపోగా..తర్వాత అడుగుతామని లిఖితపూర్వకంగా చెప్పటం విశేషం. ఇఫ్పుడు ఆర్ధిక మంత్రి అమరావతికి డబ్బులు లేవని చెప్పటం సంచలనంగా మారింది. అదే సమయంలో అమరావతిపై తుది నిర్ణయం తీసుకోవటానికి తమకు మరికొంత సమయం పడుతుందని బుగ్గన తెలిపారు.
సింగపూర్ లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. అమరావతిని విస్మరించలేదన్నారు. భారత్- సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు బుగ్గన హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్నిచోట్లా ఉత్పాదకరంగ అభివృద్ధికి.. మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధమ్యాలన్నారు. అమరావతిలో ఆర్థికనగరం అభివృద్ధికే సింగపూర్ సంస్థలు పరిమితమన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించామన్నారు. ప్రాధాన్యత అంశాల్లో భాగంగా తాము గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, నాలుగు ఓడరేవు, హెల్త్, ఆక్వా రంగాల్లో విదేశీ సంస్థలతో కలసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.