Telugu Gateway
Andhra Pradesh

కేంద్రంపై అసంతృప్తా...లేదే!

కేంద్రంపై అసంతృప్తా...లేదే!
X

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటల పాటు చర్చలు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీపై సర్వత్రా ఉత్కంఠ. పెండింగ్ పడిపోయిన విభజన సమస్యల పరిష్కారంతో పాటు నీటి ప్రాజెక్టులతో పాటు పలు అంశాలపై ఇరు రాష్ట్రాల పరస్పర సహకారంపై చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఈనాడులో మాత్రం కేంద్రం తీరు, బిజెపి వ్యవహారంపై ఇద్దరు ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని..ఇద్దరూ కలసి కట్టుగా బిజెపి ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రముఖంగా ఓ కథనాన్ని ప్రచురించింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఏ మాత్రం కేంద్రం పట్టించుకోవటంలేదని ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని ప్రముఖంగా పేర్కొంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక జగన్ బిజెపి సర్కారుపై కానీ, ప్రధాని నరేంద్రమోడీపై విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కానీ బిజెపి మాత్రం జగన్ సర్కారు విషయంలో చాలా దూకుడుగా వెళుతోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కెసీఆర్ మాత్రం బిజెపి అంటే మండిపడుతున్నారు. తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం అమిత్ షాలపై కూడా విమర్శలు చేశారు.

తెలంగాణలో బిజెపి ఎదుగుదలకు బ్రేకులు వేసేందుకు తనంతట తాను ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చిన వార్త ఏపీ సర్కారును ఇరకాటంలోకి నెట్టినట్లు కన్పిస్తోంది. ముఖ్యంగా ఏపీ సీఎంవో ఈనాడు వార్తకు సుదీర్ఘ వివరణ ఇఛ్చింది. విచిత్రం ఏమిటంటే తెలంగాణ సర్కారు నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా లేదు. ఏపీ సీఎంవో వివరణలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ‘ఈనాడులో ప్రచురితమైన కథనం కల్పితం. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశమేదీ ప్రస్తావనకు రాలేదు. ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నాం. అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని ఏపీ సీఎంవో స్పష్టం చేసింది. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొంది.

గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్‌ కుడికాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, ఈ ప్రాజెక్టును సఫలం చేసేదిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారని సీఎంవో పేర్కొంది. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారని, పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై కూడా చర్చించారని తెలిపింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలోనూ శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని, విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారని సీఎంవో తెలిపింది. సోమవారం నాటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సమావేశం మీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరమని పేర్కొంది.

Next Story
Share it