వెనక్కితగ్గిన అమిత్ షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హిందీకి సంబంధించిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే హిందీ నేర్చుకోవాలని తాను సూచించానే తప్ప..హిందీని తప్పనిసరి చేస్తామనలేదని తెలిపారు. ఒక దేశం..ఒకటే భాష అంటూ హిందీని జాతీయ భాష చేస్తామని అమిత్ షా ప్రకటించటంపై పలు రాష్ట్రాలు తీవ్రంగా స్పందించాయి. దీంతో చివరకు అమిత్ షా వివరణ ఇచ్చారు. తాజాగా అమిత్ షా వ్యాఖ్యలపై సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా స్పందించారు. అమిత్ షా నిర్ణయాన్ని పలు దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ఖండించాయి. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా షా వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
ఈ నేపథ్యంలో జాతీయ భాషగా హిందీ అంశంలో అమిత్ షా వెనక్కి తగ్గారు. ప్రాంతీయ భాషలను వదిలి హిందీని జాతీయ భాషగా మార్చాలని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు. ‘హిందీని జాతీయ భాషగా మార్చి ప్రాంతీయ భాషలను పక్కకు పెట్టాలని నేను ఎప్పుడు అనలేదు. కాకపోతే మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించాను. నేను నాన్ హిందీ రాష్ట్రం గుజరాత్‌కు చెందిన వాడినే కదా. కానీ కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించి.. రాజకీయం చేయలని భావిస్తున్నారు. ఇక దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అన్నారు.