Telugu Gateway
Andhra Pradesh

మోడీ అనుమతితో జగన్ పాలన చేస్తున్నారా?.

మోడీ అనుమతితో జగన్ పాలన చేస్తున్నారా?.
X

ఎవరూ ఊహించని మెజారిటీ. ఏకంగా 151 సీట్లు. సొంత పార్టీలోనూ ఎవరూ నోరు తెరిచి ప్రశ్నించే సాహసం చేయలేనంత సంఖ్య. అటు ఎంపీల విషయంలోనూ అంతే..ఎమ్మెల్యేల విషయంలోనూ అంతే. అలాంటి పరిస్థితిలో ఏపీ సీఎం జగన్ తాను చేసే నిర్ణయాలు అన్నింటిని ముందే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరిస్తున్నారా?. వాళ్లకు చెప్పే చేస్తున్నారా?. అవును అని సాక్ష్యాత్తూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా వెల్లడించారు. అసలు జగన్ కు ఆ అవసరం ఏముంది?. ఇంత పెద్ద మెజారిటీ పెట్టుకుని ఏపీలో పాలనకు సంబంధించి మోడీ, అమిత్ షాల కు చెప్పి చేయాల్సిన అవసరం ఏముంది?. విద్యుత్ పీపీఏల సమీక్షపై కేంద్ర కార్యదర్శి, కేంద్ర మంత్రి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాస్తే రాష్ట్రానికి ఆ అధికారం ఉందని..కేంద్ర అభ్యంతరాలకు సమాధానం చెబుతామని సాక్ష్యాత్తూ జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) రివర్స్ టెండరింగ్ వద్దని..దీని వల్ల వ్యయం పెరగటంతోపాటు పనుల్లో జాప్యం జరుగుతందని లేఖ రాస్తే దాన్న బేఖాతర్ చేసి సర్కారు రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక కేంద్రానికి నివేదిక ఇవ్వటంలో తప్పు లేదు. కానీ అక్రమాలు జరిగాయని..ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని పీపీఏలను రద్దు చేస్తున్నామని, తమకు ఆ అధికారం ఉందని చెబుతుంటే విజయసాయిరెడ్డి అన్నీ మోడీ, అమిత్ షాకు చెప్పి చేస్తున్నామని అనటం ద్వారా ప్రజలిచ్చిన తీర్పున అపహస్యం చేస్తున్నట్లు కాదా?. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని చెప్పి చేయటానికి మోడీ, అమిత్ షాలు ఏమైనా వైసీసీ అధిష్టానమా? అని ఓ నేత వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టడం ఖాయం అని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ మరీ వీక్ గా ఉంది కాబట్టి ఓకే..కానీ రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలను ఆ పార్టీ అస్త్రంగా చేసుకోవటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it