‘సాహో’ కోసం వాయిదా సాయం

సాహో. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా రిలీజ్ కూడా అంతే భారీ స్థాయిలో ఉండాలి. మరి అలాంటి సినిమాకు కూడా పోటీ ఉంటే?. అంటే ఈ సినిమాకు మరో సినిమా ఛాలెంజ్ అని కాదు కానీ..థియేటర్లు అందుబాటులో ఉండటం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఆ సమస్య లేకుండా చేశారు పలు చిత్రాలకు చెందిన నిర్మాతలు. సాహో కోసం తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని సాహో చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అంతర్జాతీయ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో ఒకే డేట్‌లో రిలీజ్ చేయాలంటే ఇతర చిత్రాలతో పోటి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అన్ని భాషల్లోనూ నిర్మాతలు సాహో రిలీజ్‌కు లైన్ క్లియర్ చేశారు. ఆగస్టు 30న రిలీజ్ కావాల్సిన తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. సాహో భారీ రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసినందుకు అన్ని భాషల నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.