Telugu Gateway
Politics

కాశ్మీర్ కు మేలు చేసే నిర్ణయమే ఇది

కాశ్మీర్ కు మేలు చేసే నిర్ణయమే ఇది
X

జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి స్వాతంత్ర దినోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. రాష్ట్రపతి జాతినుద్దేశించి బుధవారం సాయంత్రం చేసిన ప్రసంగంలో కూడా ఇదే అంశంపై ఫోకస్ పెట్టారు. ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్‌, లడాఖ్‌ విభజన వంటి కేంద్ర నిర్ణయాలు.. ఆ రెండు ప్రాంతాలకు విశేషంగా ప్రయోజనం చేకూరుస్తాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌, లడాఖ్‌లో తీసుకొచ్చిన మార్పులతో.. తోటి దేశ ప్రజలతో సమానంగా హక్కులు, ప్రభుత్వ ఫలాలను ఆ రెండు ప్రాంతాల ప్రజలు కూడా పొందుతారని, దీనితో ఆ రెండు ప్రాంతాలు విశేషంగా లబ్ధి పొందుతాయని చెప్పారు. దేశ ప్రజలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందని కోవింద్‌ తెలిపారు.

‘దేశ నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఇందులో స్వాతంత్ర్యం ప్రధాన మైలురాయి. దేశ నిర్మాణం కోసం ప్రతి సంస్థ, ప్రతి పౌరుడూ చేయి-చేయి కలిపి.. సామరస్యంతో, ఐక్యతతో కృషి చేయాలి. ఓటర్లకు, ప్రజాప్రతినిధులకు, పౌరులకు, ప్రభుత్వానికి, పౌరసమాజానికి, రాజ్యానికి మధ్య సముచితమైన భాగస్వామ్యం ఉండేలా కృషి చేయాలి’ అని కోవింద్‌ పిలుపునిచ్చారు. ‘ఓ ప్రత్యేక తరుణంలో మనం స్వాతంత్ర్య దేశంగా 72 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నాం. మరికొన్ని వారాల్లో అక్టోబర్‌ 2వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మార్గదర్శి జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు నిర్వహించుకోనున్నాం’ అని అన్నారు.

Next Story
Share it