Telugu Gateway
Telangana

సింధు..సాధించెన్

సింధు..సాధించెన్
X

అన్ని మ్యాచ్ ల్లోనూ అలవొకగా గెలుస్తుంది. కానీ ఫైనల్ అంటే ఫోబియా వచ్చేస్తోంది. అలా ఫైనల్స్ లో సింధు ఓటమి పాలైన మ్యాచ్ లు ఎన్నో. అయితే ఈ సారి అలా కాదు. ఫైనల్ ఫోబియాకే ఫోబియా పట్టేలా ఆడింది. అందరి అంచనాలను తలకిందులు చూస్తూ ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో ‘స్వర్ణ’ అధ్యాయాన్ని లిఖించింది పీవీ సింధూ. దీంతో దేశమంతా సింధు సాధించెన్ అంటూ సంబరాలు చేసుకుంది. ఈ రికార్డు సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు సొంతం చేసుకుంది. రెండేళ్ల క్రితం హోరాహోరీగా సాగిన విశ్వ సమరంలో తనను ఓడించిన జపాన్‌ క్రీడాకారిణి ఒకుహారాను ఈసారి సింధు చిత్తుగా ఓడించింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు కేవలం 38 నిమిషాల్లో 21–7, 21–7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, 2017 ప్రపంచ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై గెలిచింది. ఈ విజయంతో 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్‌గా చైనా క్రీడాకారిణి జాంగ్‌ నింగ్‌ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది. ఒకుహారాపై తాజా విజయంతో ముఖాముఖి రికార్డులో సింధు ఆ«ధిక్యాన్ని 9–7కు పెంచుకుంది. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. వారికి కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. తన చిరకాల ప్రత్యర్థి ఒకుహారాతో జరిగిన ఫైనల్లో సింధు తొలి పాయింట్‌ నుంచి చివరి పాయింట్‌ వరకు దూకుడుగానే ఆడింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో తొలి పాయింట్‌ను 22 షాట్‌ల ర్యాలీలో కోల్పోయిన సింధు ఆ తర్వాత విశ్వరూపమే ప్రదర్శించింది. వరుసగా 8 పాయింట్లు గెల్చుకొని 8–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఎనిమిది పాయింట్లలో ఆరు సింధు ధాటికి ఒకుహారా చేసిన అనవసర తప్పిదాలతోనే వచ్చాయి. మిగతా రెండు పాయింట్లను సింధు విన్నర్స్‌తో సాధించింది. ఆ తర్వాత ఒకుహారా ఒక పాయింట్‌ గెలిచినా... సింధు మళ్లీ చెలరేగింది. ఈసారీ వరుసగా 8 పాయింట్లు గెలిచి 16–2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సింధు తొలి గేమ్‌ను కేవలం 16 నిమిషాల్లో దక్కించుకుంది.

Next Story
Share it