Telugu Gateway
Politics

బిన్ లాడెన్ తనయుడిని హతమార్చిన అమెరికా!

బిన్ లాడెన్ తనయుడిని హతమార్చిన అమెరికా!
X

బిన్ లాడెన్. ఆ పేరు అమెరికాను కొద్దికాలం పాటు వణికించింది. ఎందుకంటే ఎవరూ ఊహించని రీతిలో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను విమానాలతో కూల్చేసిన ఘటనలో బిన్ లాడెన్ పాత్ర ఉందని అమెరికా గుర్తించింది. 2001 సెప్టెంబర్ 11న జరిగిన విమానాల దాడి ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అమెరికా చాలా కాలం పాటు ఒసామా బిన్ లాడెన్ కోసం గాలించింది. చివరకు అత్యంత పకడ్భందీ వ్యూహంతో అమెరికా 2011 మే2న బిన్ లాడెన్ ను మట్టుబెట్టింది. ఇప్పుడు అమెరికానే ఆయన తనయుడు, లాడెన్ వారసుడిని అంతమొందించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, ఆల్‌ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కొడుకు హంజా బిన్‌ లాడెన్‌ హతమైనట్లు అమెరికాకు చెందిన ఎన్‌బీసీ న్యూస్‌ సంచలన వార్త వెలువరించింది. హంజా మృతి చెందాడని అమెరికా ఇంటలెజిన్స్‌ అధికారులు తెలిపినట్లు సదరు ఛానల్‌ పేర్కొంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గానీ, శ్వేతసౌధ వర్గాలు గానీ హంజా మరణాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

ఒసామా 20 మంది పిల్లల్లో 15వ వాడైన హంజా ఆల్‌ఖైదా నాయకత్వానికి వారసుడిగా ఎంపికైనట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. తండ్రి బిన్‌ లాడెన్‌ మరణానంతరం అల్‌ఖైదాలో హంజాకు సీనియర్‌ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సన్నద్ధమవుతున్నట్లు పలు రిపోర్టులు నివేదించాయి. దీంతో అతడి కోసం అమెరికా గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. అయితే జిహాద్‌ రాజకుమారుడిగా చెప్పుకునే 29 ఏళ్ల హంజా జాడ కోసం అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలుత అతడు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని, అనంతరం అఫ్గనిస్తాన్‌, సిరియాల్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఇస్లాం రాజ్యాన్ని స్థాపిస్తామని సిరియాలో నరమేధం సృష్టించిన ఐసిస్‌ తరహాలో అటు బిన్‌ లాడెన్‌ హత్యపై ప్రతీకారం.. ఇటు జిహాద్‌ విస్తరణకు హంజా సన్నద్ధమవుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హంజా ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్‌ డాలర్లు ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it