Telugu Gateway
Cinema

ఎన్టీఆర్..చరణ్ ల స్నేహగీతం

ఎన్టీఆర్..చరణ్ ల స్నేహగీతం
X

టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య స్నేహం గత కొంత కాలంగా మరింత బలోపేతం అవుతోంది. రెండు కుటుంబాలు కూడా కలసి పార్టీలు చేసుకున్న సందర్భాలు ఎన్నో. ఫ్రెండ్ షిప్ సందర్భంగా వీరిద్దరూ తమ స్నేహన్ని మరోసారి చాటుకున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్‘లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి కూడా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ట్వీట్ చేశారు. వారాహి చలనచిత్రం అధినేత, నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన జక్కన్న.. ‘విధి అనుకూలిస్తేనే సాయిగారిలాంటి వ్యక్తిని కలిస్తాం. చిన్నపిల్లాడి మనస్తత్వం, నమ్మకానికి రూపం, వెన్నంటి ఉండే బలం. ఆయన నా భీమ్‌. ఆయన ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు.

ఈ ట్వీట్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ యే దోస్తీ(#RRRYehDosti) అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్ చేశారు.ఆర్‌ఆర్ఆర్‌ హీరో ఎన్టీఆర్ కూడా ఇదే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. రామ్‌చరణ్‌తో కలిసి తాను దిగిన ఫోటోను షేర్ చేసిన తారక్‌ ‘స్నేహం ఎంపికలో నెమ్మదిగా వ్యవహరించండి. కానీ ఒక్కసారి స్నేహం చేస్తే ఎప్పటికీ వారితో బలమైన బంధాన్ని కొనసాగించండి’ అంటూ సోక్రటిస్‌ చెప్పిన కోట్‌ను పోస్ట్ చేసిన తారక్‌, ఇంతకన్నా మా స్నేహం గురించి చెప్పడానికి మరో వాఖ్యం లేదని కామెంట్ చేశాడు‌. రామ్‌ చరణ్‌ కూడా తారక్‌తో తనకున్న అనుబం‍ధాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేశాడు. కొన్ని బంధాలు ఏర్పడటానికి చాలా సమయం పడుతుంది. ఒకసారి ఏర్పడ్డ తర్వాత జీవితాంతం అలాగే ఉంటాయి. నాకు తారక్ తో అలాంటి బంధమే ఏర్పడింది అంటూ ట్వీట్ చేశారు చరణ్.

Next Story
Share it