Telugu Gateway
Politics

కెసీఆర్ కు ఇది ‘పరీక్షా సమయం’

కెసీఆర్ కు ఇది ‘పరీక్షా సమయం’
X

తొలిసారి. దాదాపు ఆరేళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో ఓ గొంతుక బహిరంగంగా బహిరంగ వేదికపై గళమెత్తింది. ‘మంత్రి పదవి నాకు ఎవరో వేసిన బిక్ష కాదు. గులాబీ జెండా ఓనర్లం మేం. పార్టీలోకి మధ్యలో వచ్చినోళ్ళం కాదు. అడుక్కుని వచ్చినోళ్ళం కాదు’ అంటూ తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో ఇంత వరకూ అణచిపెట్టుకున్న అసంతృప్తి జ్వాలల ఫలితమా?. లేక తెగింపా?. తొలి విస్తరణలో అసలు ఈటెల రాజేందర్ కు మంత్రి పదవి వస్తుందో రాదో అన్న విషయంలోనూ చివరి వరకూ ఉత్కంఠే నడిచింది. కానీ చివరకు జాబితాలో ఆయన పేరు చేరింది. గత ఆరేళ్ళుగా పార్టీలో ఉండి కెసీఆర్ నిర్ణయాలను ప్రశ్నించటం కానీ..ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇప్పటివరకూ నోరెత్తిన వారు లేరు. అలాంటి సమయంలో ఈటెల వంటి సీనియర్ నేత ‘మంత్రి పదవి నాకు ఎవరో వేసిన బిక్ష కాదు’ అని వ్యాఖ్యానించారంటే దానర్ధం ఏంటి?. కెసీఆర్ విమర్శలను ఏ మాత్రం సహించరనే పేరుంది.

సాక్ష్యాత్తూ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్య ఓ విధాన నిర్ణయం ప్రకటిస్తే బహిరంగంగా ఆయన్ను వేదికపైనే కెసీఆర్ అవమానపర్చిన సందర్భం ఉంది. ఎవరు ఔనన్నా కాదన్నా మంత్రివర్గంలో ఎవరు ఉండాలో..ఉండొద్దొ నిర్ణయించుకునేది ముఖ్యమంత్రులే. మరీ ప్రాంతీయ పార్టీల్లో అయితే ఇక దానికి తిరుగే ఉండదు. ఈ విషయం తెలిసి కూడా ఈటెల ఎందుకు అంత సాహసం చేశారు. ఈటెల తన సంచలన ప్రకటన తర్వాత గురువారం రాత్రి వెంటనే కెసీఆరే తమ నాయకుడు అని ‘సర్దుబాటు’ వివరణ ఇచ్చినా..అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. మరి కెసీఆర్ ఈటెలను ఉపేక్షిస్తారా?. లేదంటే ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించి అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని తీసుకుంటారా?.

రాజయ్య విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. అయితే తెలంగాణలో బీసీ సామాజికవర్గం ఎంతో బలమైనది. సామాజిక వర్గపరంగా కాకుండానే ఈటెలకు మంచి పేరు ఉంది. ‘ఈటెలను మార్చకపోతే సీఎం కెసీఆర్ బలహీనం అయినట్లు అవుతుంది. మారిస్తే రాజకీయంగా బీసీలను అణచివేస్తున్నారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈటెల ప్లేస్ లో కొత్తగా మరొకరని తీసుకున్నా ఆ ప్రభావం ఖచ్చితంగా పార్టీపై ఉంటుంది. నిజంగా ఇది ఇప్పుడు కెసీఆర్ కు ‘పరీక్షా సమయం’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. మరి ఈటెల పేల్చిన బాంబు ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. అయితే ఈటెల రాజేందర్ పై ఎంపిక చేసిన మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయించటం ద్వారా ఆయన మంత్రి పదవికి ఎసరు పెట్టాలని కొంత మంది పెద్దలే స్కెచ్ చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it