Telugu Gateway
Telangana

కాళేశ్వరం..ప్రపంచంలో అతి పెద్ద స్కామ్

కాళేశ్వరం..ప్రపంచంలో అతి పెద్ద స్కామ్
X

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విమర్శల దూకుడు పెంచింది. ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం అని పేర్కొన్నారు. 28 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టును లక్ష కోట్ల రూపాయలకు పెంచారని ఆరోపించారు. రివర్స్ పంపింగ్ పేరుతో నాలుగు చోట్ల నీళ్ళు ఎత్తిపోస్తూ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారన్నారు. భట్టి విక్రమార్క గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్కారు ప్రతి స్కీమ్ లోనూ స్కామ్ ఉందని ఆరోపించారు. గత ఐదేళ్ళ పాటు టీఆర్ఎస్, బిజెపి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాయని..ఇప్పుడు మాత్రం బిజెపి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారన్నారు.

తెలంగాణలో అవినీతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి విచారణ కోరతామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన అంబేద్కర్ ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టును తమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు వచ్చేదన్నారు. రివర్స్ పంపింగ్ అవసరమే ఉండేది కాదన్నారు. సీతారామ ప్రాజెక్టు కూడా స్కామ్ కు కేంద్రంగా మారిందని అన్నారు. 1500 కోట్ల రూపాయలతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని 15 వేల కోట్ల రూపాయలకు పెంచారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ తో ఎలాంటి రహస్య ఒప్పందం లేకపోతే బిజెపి తెలంగాణ సర్కారు అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.

Next Story
Share it