Telugu Gateway
Andhra Pradesh

జగన్ కొత్త కాన్సెప్ట్ ‘కాఫీ టుగెదర్’

జగన్ కొత్త కాన్సెప్ట్ ‘కాఫీ టుగెదర్’
X

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమానికి సీఎం జగన్ ‘స్పందన’ అని పేరు పెట్టారు. వినతి తీసుకోవటంతోపాటు..ఎన్ని రోజుల్లోగా సమస్య పరిష్కారం చేస్తారో తెలుపుతూ ప్రజలకు రశీదులు కూడా ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ఇది ఇప్పుడు ఏపీలో చాలా వరకూ మంచి ఫలితాలను సాధిస్తుందనే సంకేతాలు అందుతున్నాయి. గతంలో వినతిపత్రాలు తీసుకుని పక్కన పడేసేవారు. ఇఫ్పుడు ఆ పరిస్థితి లేకుండా బాధ్యతతో వ్యవహరించాల్సి వస్తోంది. అదే జోష్ తో ఏపీ సీఎం జగన్ తాజాగా భూ సమస్యల పరిష్కారానికి ఓ వినూత్న సూచన చేశారు. జిల్లాకు చెందిన కలెక్టర్, ఎస్పీలు ప్రతి వారం ‘కాఫీ టుగెదర్’ పేరుతో కలుసుకోవాలన్నారు. దీని ద్వారా అధికారుల మధ్య సమన్వయం కుదిరి భూవివాదాల పరిష్కారానికి అవకాశముంటుందని అన్నారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన స్పందన సమీక్షా సమావేశం సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ప్రతి మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘కాఫీ టుగెదర్‌’ కార్యక్రమం పేరుతో కలుసుకోవాలి. భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలి. గురువారం తహశీల్దార్, ఎస్సై, సర్వేయర్, ఆర్‌ఐ, వీఆర్వోలు కలిసి కూర్చోవాలి. భూవివాదాల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలు చేసిన ఈ ప్రతిపాదనలు బాగున్నాయి. మిగతా అధికారులు ఇది పాటించాలి. మళ్లీ చెప్తున్నా.. ఎక్కడా అవినీతి ఉండకూడదు’ అని తేల్చిచెప్పారు.

Next Story
Share it