Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ఇక నాలుగు రాజధానులు!

ఏపీలో ఇక నాలుగు రాజధానులు!
X

ఏపీ నూతన రాజధాని వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రులు అమరావతికి సంబంధించి తమ ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ తాను రాజధానికి సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అమెరికా పర్యటన నుంచి వెనక్కి వచ్చిన సీఎం జగన్ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రభుత్వం అంతా ఉద్దేశపూర్వకంగానే అమరావతి నుంచి రాజధాని తరలింపుపై ప్రకటనలు చేస్తుందనే విషయం అర్ధం అవుతోంది. ఇదిలా ఉంటే బిజెపి ఎంపీ టీ జీ వెంకటేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఏపీలో మరింత కలకలం రేపాయి. అమరావతిలో రాజధాని ఉండదని..కొత్తగా నాలుగు రాజధానులు ఉంటాయని సీఎం జగన్ బిజెపి అగ్రనేతలకు చెప్పారని టీ జీ వెంకటేష్ బాంబు పేల్చారు.

తమ పార్టీ నేతలే తనకు ఆ విషయం చెప్పారన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే యోచనతోనే ఈ ప్రతిపాదన తెచ్చారని తెలిపారు. అమరావతిపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల టీడీపీకి నష్టం జరిగిందని..ఇదే కారణంతో మంగళగిరిలో నారా లోకేష్ ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని అన్నారు. జగన్, కెసీఆర్ ల దోస్తీ గురించి ప్రస్తావిస్తూ కెసీఆర్ తో ఎవరు కలిసినా నాశనం తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును ఆపటం ఏ మాత్రం సరికాదని అన్నారు. అయితే టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి పెద్దగా స్పందన లేకపోవటం కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది.

Next Story
Share it