Telugu Gateway
Cinema

దేవదాస్ కనకాల మృతి

దేవదాస్ కనకాల మృతి
X

తెలుగు సినీ రంగానికి షాక్. సినీ రంగానికి సంబంధించి దేవదాసు వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించారు. ఆయన నటుడుగానే కాకుండా..దర్శకుడిగా, శిక్షకుడిగా ఉన్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ సీనియర్‌ నటుడు, రాజీవ్‌ కనకాల తండ్రి దేవదాస్‌ కనకాల(74) శుక్రవారం నాడు మరణించారు. గతేడాది ఫిబ్రవరిలో దేవదాస్‌ కనకాల భార్య లక్ష్మీ దేవి కనకాల మృతి చెందిన సంగతి తెలిసిందే. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన తొలితరం నటుల్లో దేవదాస్‌ కనకాల ఒకరు. దేవదాస్‌ కనకాల హైదరాబాద్‌లో యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పి ఈ తరం వారికి నటనలో శిక్షణ ఇస్తున్నారు.చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌, రజనీకాంత్‌తో సహా పలువురు ప్రముఖ నటుల చేత ఒకప్పుడు దేవదాస్‌ కనకాల నటనలో ఓనమాలు దిద్దుకున్న విషయం తెలిసిందే.

దేవదాస్‌ కనకాల 1945లో జూలై 30న యానాంలో జన్మించారు. దేవదాస్‌ స్వగ్రామం యానాం శివారులోని కనకాల పేట. తండ్రి కనకాల తాతయ్య నాయుడు యానాం ఫ్రెంచి పరిపాలనలో ఉన్నప్పుడు యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. తల్లి మహాలక్ష్మమ్మ. దేవదాస్‌ కనకాలకు ఒక కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు. రాజీవ్ వివాహం ప్రముఖ టీవీ యాంకర్ సుమతో, శ్రీలక్ష్మీ వివాహం నాటకరంగ ప్రముఖుడు డా. పెద్ది రామారావుతో జరిగింది. చలి చీమలు, నాగమల్లి వంటి చిత్రాలకు దేవదాస్‌ కనకాల దర్శకత్వం వహించారు. ఓ సీత కథ, భలే దంపతులు, మనసంతా నువ్వే, శ్రీరామ్‌, పెదబాబు, అమ్మో ఒకటో తారీఖు, సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్‌ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్‌ కనకాల నటించారు. భరత్‌ అనే నేను ఆయన నటించిన చివరి చిత్రం.

Next Story
Share it