Top
Telugu Gateway

కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంలో ఛాలెంజ్ చేస్తాం

కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంలో ఛాలెంజ్ చేస్తాం
X

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. కేంద్రం ఇలా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ పోతే ఫెడరిలిజానికి అర్ధం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో స్పష్టం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ సర్కారు చారిత్రక తప్పిదం చేసిందని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. ఆర్టికల్‌ 370 తాత్కాలికమైంది కాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. దేశాన్ని కాశ్మీరైజేషన్‌ చేయడం మనమంతా చూస్తున్నామమని వ్యాఖ్యానించారు.

శ్రీనగర్‌ను వెస్ట్‌ బ్యాంక్‌ మాదిరిగా తయారు చేశారని దుయ్యబట్టారు. కేంద్ర బలగాల నిర్బంధం నుంచి కాశ్మీరీలకు విముక్తి కల్పించాలని అసదుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ‘సోమవారం ఈద్‌ పండుగ జరగనుంది. గొర్రె పిల్లలకు బదులుగా కాశ్మీరీలు బలి కావాలని మీరు కోరుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వారు త్యాగాలకు వెనుకాడరు’ అని అసదుద్దీన్‌ పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో నేను వ్యవసాయ భూమి కొనుగోలు చేయగలనా, లక్షద్వీప్‌కు అనుమతి లేకుండా నన్ను వెళ్లనిస్తారా అంటూ ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

Next Story
Share it