బిజెపిలోకి టీడీపీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి!
తెలంగాణ నుంచే కాదు. ఏపీ టీడీపీ నుంచి కూడా బిజెపిలోకి వలసలు ఉంటాయా?. తాజా పరిణామాలు చూస్తుంటే వ్యవహారం ఆ దిశగానే సాగుతున్నట్లు కన్పిస్తోంది. ఏపికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోమవారం నాడు హైదరాబాద్ లో బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె పీ నడ్డాతో సమావేశం అయ్యారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యతో కలసి ఆయన రాష్ట్ర బిజెపి కార్యాలయానికి చేరుకున్నారు. గత కొంత కాలంగా ఆదినారాయణరెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన నేరుగా బిజెపి తెలంగాణ కార్యాలయానికే రావటంతో ఇక పార్టీ మారటం లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీడీపీ ఓటమి పాలైనప్పటి నుంచి ఆదినారాయణరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై గెలిచిన ఆయన తర్వాత టీడీపీలో చేరి ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు.
ఆదినారాయణరెడ్డి వస్తే కడపలో బలం పుంజుకుంటామని నమ్మిన చంద్రబాబు ఆయనకు ఎక్కడలేని ప్రాధాన్యత ఇచ్చారు. అయినా జరిగింది శూన్యం. పైగా ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చారని తీవ్ర విమర్శలు మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఇది కూడా గత ఎన్నికల్లో టీడీపీపై ప్రతికూల ప్రభావం చూపిన అంశాల్లో ఒకటి. ఇప్పుడు ఏకంగా ఆదినారాయణరెడ్డి బిజెపిలోకి చేరనుండటం టీడీపీకి మరింత షాక్ లాంటి పరిణామమే. అయితే ఇది ఆయన ఒక్కడితోనే ఆగిపోతుందా. లేక వరస పెట్టి చేరికలు ఉంటాయా? అన్నది వేచిచూడాల్సిందే.