Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ స్టాండ్స్ మారుతుంటాయట

వైసీపీ స్టాండ్స్ మారుతుంటాయట
X

అసెంబ్లీ సాక్షిగా ఏపీ ఆర్ధిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించి..కెసీఆర్ ను హిట్లర్ అని..ప్రాజెక్టు పూర్తయితే ఇండియా-పాకిస్థాన్ లా రెండు రాష్ట్రాల పరిస్థితి మారుతుందని ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సభలో ప్రస్తావించారు. దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు. కెసీఆర్ కాళేశ్వరం కడుతున్నప్పుడు మీరు గాడిదలు కాశారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కెసీఆర్ ఎంతో ఉదారంగా ముందుకొచ్చారని.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్ లకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తమ భూబాగం నుంచే ప్రాజెక్టులకు కెసీఆర్ సమ్మతించారని అన్నారు. దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకుంటూ ఇప్పుడు మీరిద్దరూ స్నేహం ఉండొచ్చు..తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తే రాష్ట్ర భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. దీనిపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ అసలు చంద్రబాబుకు బుద్ధి, జ్ణానం ఉందా ? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి ప్రాజెక్టుల విషయంలో నీటి పంపిణీకి రెండు రాష్ట్రాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు ఉండవా? అని ప్రశ్నించారు.

అలాంటప్పుడు చంద్రబాబు ఎందుకు రాష్ట్ర విభజనకు సంతకం పెట్టారని..శ్రీశైలం, నాగార్జునసాగర్ తమకే ఇవ్వాలని కోరి ఉండాల్సింది కదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై టీడీపీ, వైసీపీల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అత్యంత కీలకమైన నీటిపారుదల ప్రాజెక్టుల అంశాన్ని జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారని..ఇది ఐదు కోట్ల ప్రజల భవిష్యత్ కు సంబంధించిన అంశం అని అన్నారు. ఈ చర్చ మధ్యలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకుని ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరాన్ని వ్యతిరేకించామని..అధికారంలోకి వచ్చాక ఇప్పటి పరిస్థితులను బట్టి స్టాండ్ మార్చుకున్నామని..స్టాండ్స్ డైనమిక్ గా ఉంటాయని వ్యాఖ్యానించారు. గతంలో పలు అంశాలపై మాట మార్చారని చంద్రబాబు విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడు ‘స్టాండ్స్ డైనమిక్’ అని ప్రకటించటం విశేషం. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక స్టాండ్..అధికారంలో ఉంటే ఒక స్టాండ్ ఉంటుందా?. వాస్తవ పరిస్థితులు..రాష్ట్రానికి ప్రయోజనాల అంశాల ఆదారంగా స్టాండ్ ఉంటుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారనుంది.

Next Story
Share it