చంద్రబాబు పథకాలపై విచారణకు సుప్రీం ఓకే
ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏదో అరకొరగా చేస్తారు. కానీ ఎన్నికల ముందు మాత్రం ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. ఇది చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న తంతే. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు ను ఎన్నికల ముందు యధేచ్చగా పంచి పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయి. తాజా ఎన్నికల్లో అప్పటి చంద్రబాబు సర్కారు ఏకంగా 30 వేల కోట్ల రూపాయలను ప్రజలకు చేరేలా చేశాయి. అందులో కొన్ని కొత్త పథకాలు..కొన్ని పాతవి కూడా ఉన్నాయి. కానీ రుణమాఫీ వంటి పథకాన్ని అమలు చేయటంలో విపరీత జాప్యం చేసి కేవలం ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు వీలుగా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మాత్రమే కొంత మందికి నిధులు విడుదల చేశారు. ఇది ఎన్నికల్లో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏ మాత్రం కాదని..ఈ తరహా పథకాల వల్ల మిగిలిన పార్టీలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఈ అంశాలన్నింటికి సంబంధించి ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చంద్రబాబు పథకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జనసేన పార్టీ నేత పెంటపాటి పుల్లారావు సుప్రీంకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారణ స్వీకరించిన సుప్రీం కోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన ఈ పథకాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని ఆయన విన్నవించారు. అదే విధంగా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచీ నగదు బదిలీ పథకాలు అమలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.