ఎవరికి ఓటు వేసినా బిజెపికే.. ఏ పార్టీలో గెలిచినా బిజెపిలోకే!

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలుతున్నాయి. ఎన్నికల ముందు ఏ పార్టీకి ఓటు వేసినా అన్నీ బిజెపికే పడుతున్నాయని ప్రచారం జరిగింది. ఎన్నికలు అయిపోయాయి..కేంద్రంలో బిజెపి రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏ పార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా బిజెపిలోకే అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు. ఈ పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయి. తాజాగా ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపి తమ పార్టీలో కలిపేసుకుంది. అదే తరహాలో గోవాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకున్నారు.
మరో వైపు కర్ణాటకలో జరుగుతున్న పరిణామాల వెనక కూడా బిజెపి ఉందనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. బిజెపి ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా..వారిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నా అదేమీ పట్టించుకోకుండా పార్టీలో చేర్చుకుంటోంది. దీంతో సోషల్ మీడియాలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గోవాలో జరిగిన పరిణామాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారికర్ తనయుడు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.