Telugu Gateway
Politics

సాన సతీష్ బాబు అరెస్ట్

సాన సతీష్ బాబు అరెస్ట్
X

సీబీఐ అంతర్గత వివాదంలో ప్రముఖంగా విన్పించిన పేరు సాన సతీష్ బాబు. ఆయన్ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. మాంసం ఎగుమతిదారు మెయిన్ ఖురేష్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సాన సతీష్ ను కీలకంగా భావిస్తున్నారు. సాన సతీష్ కు పలు వ్యాపారాలు ఉన్నాయి. ఢిల్లీలో లాబీయింగ్ చేయటంలో ఆయనకు దిట్టగా పేరుంది. అటు కేంద్రంతో పాటు ఏపీలోని కొంత మంది ఐఏఎస్ లతో కూడా సాన సతీష్ బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతారు. అదే సమయంలో టీడీపీకి చెందిన కీలక నేతలతో ఆయన సన్నిహితంగా ఉంటారు. కొన్నిసార్లు అధికారంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబుతో కలసి విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా ఆయన్ను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. మెయిన్ ఖురేషీని కేసు నుంచి బయట పడేసేందుకు పలు శాఖలకు చెందిన అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అప్పగించినట్లు సతీష్ బాబు చెప్పటం అప్పట్లో పెద్ద కలకలం రేపింది. సీబీఐ ఫిర్యాదుతోనే సీబీఐలో వివాదాలు బయటపడి దేశంలోనే పెద్ద కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా తప్పించుకు తిరుగుతున్న సతీష్ బాబును ఈడీ అధికారులు పట్టుకున్నారు. సతీష్ రేపిన దుమారంతో అప్పటి సీబీఐ డైరక్టర్ అలోక్ వర్మ, డిప్యూటీ డైరక్టర్ రాకేష్ అస్థానలు తమ తమ పదవులు కోల్పోవాల్సి వచ్చింది.

Next Story
Share it